75 నుంచి 80 సీట్లు గెలుస్తాం

Mallu Bhatti Vikramarka Chit Chat With Media - Sakshi

మీడియాతో ఇష్టాగోష్టిలో మల్లు భట్టి విక్రమార్క

సాక్షి, హైదరాబాద్‌: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రజాకూటమి 75 నుంచి 80 స్థానాల్లో విజయం సాధిస్తుందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. కూటమిగా అవగాహనతో పోటీచేస్తామని, కలిసి పనిచేసి ఆ నలుగురి నుంచి తెలంగాణను విముక్తి చేస్తామని చెప్పారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయని, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ప్రజాకూటమిగా ఏర్పడ్డామని తెలిపారు. ప్రజాకూటమి దెబ్బకు కేటీఆర్‌ మైండ్‌ బ్లాక్‌ అయిందని వ్యాఖ్యానించారు. అధికారం, సంపద, వనరులను నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు పంచడమే కూటమి ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణను ఆ నలుగురి నుంచి విముక్తి చేయడం, సంపద పంచడం ఖాయమన్నారు. నాలుగు గోడల మధ్య ఫాంహౌస్‌లో కూర్చుని వ్యవహారాలు నడిపే వాళ్లం కాదన్నారు.

భవిష్యత్‌లో న్యాయం..
కూటమి ఏర్పాటు ద్వారా పోటీ చేసే అవకాశం రాని నేతలు నిరాశపడవద్దని, వారి త్యాగాలను పార్టీ తప్పకుండా గుర్తిస్తుందని భట్టి అన్నారు. టికెట్లు రాని వారికి భవిష్యత్తులో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం చేయాలనే ఆలోచనతోనే పార్టీ హైకమాండ్‌ ఉందని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త ప్రజాకూటమిని గెలిపించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అభ్యర్థుల ఖరారు ప్రక్రియ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ప్రచారాన్ని వేగవంతం చేస్తామని భట్టి చెప్పారు. మొత్తం 10 సభలు ఉంటాయని, అందులో ఒక సభకు సోనియా, మిగిలిన వాటికి రాహుల్‌ హాజరవుతారని తెలిపారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top