‘జల వివాదాల’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Lok Sabha passes inter-state river water disputes amendment bill - Sakshi

18 శాతం జనాభా ఇండియాలోనే.. నీళ్లు 4 శాతమే: మంత్రి  

న్యూఢిల్లీ: అంతర్‌ రాష్ట్ర జల వివాదాలను వేగంగా, ఓ క్రమపద్ధతిలో పరిష్కరించేందుకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ బుధవారం ఆమోదించింది. అంతర్‌ రాష్ట్ర నదీ జల వివాదాల (సవరణ) బిల్లు–2019 బిల్లును లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. బిల్లును కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ప్రవేశపెడుతూ, వివిధ రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదాలను పరిష్కరించడంలో ప్రస్తుతం ఉన్న ట్రిబ్యునళ్లు విఫలమయ్యాయనీ, కాబట్టి పరిష్కార విధా నంలో మార్పు అవసరమన్నారు. ఓ కేసులో అయితే 33 ఏళ్లయినా వివాదాన్ని ట్రిబ్యునల్‌ పరిష్కరించలేకపోయిందని చెప్పారు.

కోర్టులు లేదా ట్రిబ్యునళ్లు నీటిని సృష్టించలేవనీ, అందరూ జల సంరక్షణపై దృష్టిపెట్టాలని మంత్రి పేర్కొన్నారు. ప్రపంచంలోని జనాభాలో 18 శాతం మంది ఇండియాలోనే ఉన్నారనీ, కానీ ప్రపంచంలోని మంచి నీళ్లలో 4 శాతమే మన దేశంలో ఉండటంతో ఇది తీవ్ర సమస్యగా మారనుందని మంత్రి చెప్పారు. సభలో చర్చ సందర్భంగా కావేరీ జల వివాదంపై తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సభ్యులు వాగ్వాదానికి దిగడంతో స్పీకర్‌ ఓం బిర్లా వారిని సముదాయించారు. కాంగ్రెస్, తృణమూల్‌ కాంగ్రెస్‌ తదితర పార్టీల సభ్యులు మాట్లాడుతూ, రాష్ట్రాలను సంప్రదించేలా ఈ బిల్లులో నిబంధనలు లేవనీ, ఇది సమాఖ్య వ్యవస్థపై దాడి అని అన్నారు.

బిల్లులో ఏముంది?: అంతర్‌ రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం–1956ను సవరించేం దుకు కేంద్రం ఈ బిల్లును తెచ్చింది. వేర్వేరు ధర్మాసనాలతో ఒకే ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేయడం, వివాదాలను పరిష్కరించేందుకు ఓ కాలపరిమితి విధించి, కచ్చితంగా ఆ సమయంలోపు సమస్య పరిష్కారమయ్యేలా చూడటం ఈ బిల్లు ప్రత్యేకతలు. సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి ట్రిబ్యునల్‌కు నేతృత్వం వహిస్తారు. అవసరమైనప్పుడు ధర్మాసనాలను ఏర్పాటు చేస్తా రు. వివాదం పరిష్కారమయ్యాక అవి రద్దవుతాయి. గరిష్టంగా రెండేళ్లలోపు వివాదాన్ని ట్రిబ్యునల్‌ పరిష్కరించాల్సి ఉంటుంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top