యువకులే ‘విజయ వికారి’లు

Lok Sabha Elections: Medak Constituency Voters Details - Sakshi

మెదక్‌ లోకసభ నియోజకవర్గంలో కొత్త ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. తెలుగు నూతన సంవత్సరం వికారినామ సంవత్సరంలో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల విజయంలో యువ ఓటర్లే కీలకం కానున్నారు. గెలుపోటముల నిర్ణేతలు 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులే కావడం గమనార్హం.

సాక్షి, దుబ్బాక టౌన్‌: మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏడు సెగ్మెంట్ల పరధిలో కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్ల జాబితాలో యువతుల కంటే యువకుల ఓట్లే అధికంగా ఉన్నాయి. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు కొత్త ఓటర్లుగా నమోదయ్యారు. ఇందులో అన్ని నియోజకవర్గాల్లోను యువతుల ఓట్లు తక్కువగా ఉండగా యువకుల ఓట్లు అత్యధికంగా ఉన్నాయి.

దుబ్బాక నియోజకవర్గంలో కొత్త ఓటర్లలో 2,938 మంది పురుషులు ఉంటే కేవలం 1,937 మంది యువతులు ఉన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో 2,810 పురుషులు, 2,277 మంది మహిళలు, ఇతరులు 1, నర్సాపూర్‌ నియోజకవర్గంలో 3,011 పురుషులు, 2,378 మంది మహిళలు, మెదక్‌ నియోజకవర్గంలో 3,082 మంది పురుషులు, 2,380 మహిళలు, సంగారెడ్డి నియోజకవర్గంలో 3,191 పురుషులు, 2,378 మహిళలు, గజ్వేల్‌ నియోజకవర్గంలో 3,779 పురుషులు, 2,566 మహిళలు, ఇతరులు 1, పటాన్‌చెరు నియోజకవర్గంలో 3,410 పురుషులు, 2,715 మహిళలు, ఇతరులు 2గా కొత్త ఓటర్లుగా నమోదయ్యారు. మొత్తం మెదక్‌ లోక్‌సభ పరిధిలో 38,648 మంది ఓటర్లకు గాను 22,221 మంది పురుషులు, 16,422 మంది మహిళలు, ఇతరులు 5 మంది ఉన్నారు. కొత్త ఓటర్లలో పురుషుల కంటే 5,799 మంది మహిళా ఓటర్లు తక్కువగా ఉండటం శోచనీయం.
యువకుల ఓట్లే అధికం

మెదక్‌ లోక్‌సభ పరిధిలో ఉన్న దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్‌చెరు నియోజకవర్గాల్లోను కొత్త ఓటర్లు ఘననీయంగా పెరిగారు. ఓటర్ల తుది జాబితాలో కొత్త ఓటర్లు 88,219 మంది పెరగగా ఇందులో యువ ఓటర్లు అత్యధికంగా ఉండటం విశేషం. కొత్తగా 38,648 మంది 18 ఏళ్లు నిండిన యువత కొత్త ఓటర్లుగా నమోదయ్యారు. కొత్తగా ఓటుహక్కు పొందిన వారు మొదటి ఓటు వేసేందుకు సంతోషంగా ఎదురుచూస్తున్నారు.

16,02,947 ఓటర్లు
మెదక్‌ లోక్‌సభ పరిధిలో తాజాగా ప్రకటించిన జాబితా ప్రకారం మొత్తం 16,02,947 ఓటర్లు ఉన్నారు. గతంలో 15,14,728 మంది ఓటర్లు ఉండేవారు. అంటే 88,219 మంది ఓట్లు పెరిగాయి. వీరిలో 38,648 మంది 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లు ఉండడం విశేషం.

యువ ఓటర్లు పట్టం కట్లేదెవరికో..?
పెరిగిన యువ ఓటర్లు గెలుపు, ఓటముల్లో కీలకంగా మారనున్నారు. మెదక్‌ లోక్‌సభ పరిధిలో 88,219 కొత్త ఓటర్లు పెరగగా వీరిలో 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లు 38,648 మంది ఉండటంతో ఎంపీగా ఎవరికి వారు పట్టం కడతారో చూడాలి మరి..

గజ్వేల్‌ అత్యధికం.. దుబ్బాకలో అత్యల్పం
మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోను కొత్త ఓటర్లు భారీగా పెరిగారు. లోక్‌సభ పరిధిలోని గజ్వేల్‌ నియోజకవర్గంలో అత్యధికంగా 6,346 మంది కొత్త ఓటర్లు, అత్యల్పంగా దుబ్బాక నియోజకవర్గంలో 4,875 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. అలాగే సిద్దిపేట నియోజకవర్గంలో 5086 మంది, మెదక్‌ నియోజకవర్గంలో 5403 మంది ఓటర్లు, నర్సాపూర్‌లో 5,180 మంది, సంగారెడ్డి నియోజకవర్గంలో 5,569 మంది ఓటర్లు, పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలో 6,127 మంది కొత్త ఓటర్లుగా నమోదయ్యారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top