జై శ్రీరామ్‌ వర్సెస్‌ దుర్గా మాతా!

Lok Sabha elections 2019:shri ram versus durga mata in West Bengal - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీల మధ్య దివ్య పోరాటం కొనసాగుతోంది. బీజేపీ నాయకులు ‘జై శ్రీరామ్‌’ అంటూ నినాదాలు చేస్తుంటే అందుకు బదులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, దుర్గా మాతా ఆశీస్సులు తనకే ఉన్నాయంటూ ప్రచారం చేస్తున్నారు. జై శ్రీరామ్‌ అన్నందుకు కావాలంటే తనను అరెస్ట్‌ చేసుకోమంటూ ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం జరిగిన ఓ ఎన్నికల ప్రచార సభలో సవాల్‌ విసిరిన విషయం తెల్సిందే.

శనివారం నాడు మమతా బెనర్జీ కారు వెళుతుంటే కొంత మంది బీజేపీ కార్యకర్తలు ‘జై శ్రీరామ్‌’ అంటూ నినాదాలు చేశారని, కారు ఆపిన మమతా వారిని విసుక్కున్నారని, అలా నినాదాలు చేసిన ముగ్గురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ సవాల్‌ చేశారు. జై శ్రీరామ్‌ అంటూ భారత్‌లో నినదించకుండా పాకిస్థాన్‌కు వెళ్లి నినాదాలు చేయమంటావా? అంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా కూడా మమతను ప్రశ్నించారు. 

పశ్చిమ బెంగాల్‌లో బలపడేందుకుగాను శ్రీరామ నవమి నాడు ‘జై శ్రీరామ్‌’ అంటూ పెద్ద ఎత్తున బీజేపీ ర్యాలీలు నిర్వహించడం ప్రారంభించిన విషయం తెల్సిందే. అలా మొదలైన నినాదాల సంస్కతి ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి పాకింది. ఒక్క రామాలయం కట్టడం చేతగానీ తమకు జై శ్రీరామ్‌ అంటూ నినాదాలు చేసే అర్హత ఎక్కడిదని, ఎందుకు శ్రీ రాముడిని ఎన్నికల ఏజెంట్‌ను చేస్తున్నారంటూ మమతా బెనర్జీ ఎదురు తిరిగారు. ‘అసలు దుర్గా మాతా గురించి మీకేం తెలుసు, ఆమెకు ఎన్ని చేతులు ఉంటాయో, ఆ చేతుల్లో ఎన్ని ఆయుధాలు ఉంటాయో తెలుసా!?’  అంటూ బీజేపీ నేతలనుద్దేశించి ఆమె ప్రశ్నిస్తున్నారు. ఆమె ఎన్నికల సభల్లో బెంగాలీలకు అత్యంత ఆరాధ్య దైవమైన దుర్గా మాతాగా మమతను చూపే పోస్టర్లను కార్యకర్తలు ప్రదర్శిస్తున్నారు. 

బెంగాల్‌లో 42 లోక్‌సభ సీట్లకు జరుగుతున్న ఎన్నికలు ఇరు పార్టీలకు ఎంత కీలకంగా మారాయన్న విషయాన్ని రెండు పార్టీల ప్రచార శైలి సూచిస్తోంది. హిందీ రాష్ట్రాల్లో నష్టపోతున్న సీట్లను బెంగాల్లో పూడ్చుకోవాలని బీజేపీ ఆశిస్తోంది. 42 సీట్లకుగాను 23 సీట్లను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top