అఖిల ప్రియపై టీడీపీ నేతల తీవ్ర ఆగ్రహం

Kurnool TDP Leaders Fires On Minister Akhila Priya - Sakshi

బాబు వద్దకు నంద్యాల పార్లమెంటు పంచాయతీ

సాక్షి, కర్నూలు : టీడీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే అధిక సంఖ్యలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పార్టీని వీడుతున్న నేపథ్యంలో నంద్యాల పార్లమెంట్‌ పంచాయితీ చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారింది. మంత్రి భూమా అఖిల ప్రియ తీరుపై సొంత పార్టీ నేతలే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం నంద్యాలలో ర్యాలీ నిర్వహించిన అఖిల ప్రియ తమకు టికెట్‌ రాకుండా కొంతమంది అడ్డుకున్నప్పటికీ.. చంద్రబాబు పిలిచి మరీ టికెట్‌ ఇచ్చారంటూ వ్యాఖ్యానించారు. ఈ విషయం గురించి తమను కాదని ర్యాలీలు నిర్వహిస్తూ తమపై అవాకులు, చెవాకులు పేలడం ఏంటని ఎన్‌ఎమ్‌డీ ఫారూఖ్‌, ఏవీ సుబ్బారెడ్డి, ఎస్పీవై రెడ్డి మండిపడుతున్నారు. టీడీపీ అధిష్టానం టికెట్‌ ప్రకటించకపోయినా తమకే టికెట్‌ వచ్చిందంటూ చెప్పుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం గురించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు నంద్యాల టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

చదవండి : మాట ఇచ్చి.. సీటు తేల్చరే! 

కాగా కర్నూలు జిల్లా సీట్ల విషయంలో సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. తమ ముగ్గురికీ సీటు ఇవ్వాల్సిందేనంటూ కర్నూలు సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డితో పాటు మంత్రి అఖిలప్రియ, నంద్యాల సిట్టింగ్‌ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి  కోరుతుండగా.. పార్టీ అధిష్టానం నుంచి సరైన స్పందన లభించడం లేదని సమాచారం. మరోవైపు కర్నూలు సీటుపై తేల్చేందుకు బుధవారం అమరావతికి రావాలంటూ ఎంపీ టీజీ వెంకటేష్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు కబురు పంపినట్టు తెలుస్తోంది. కర్నూలుతో పాటు కోడుమూరు, నందికొట్కూరు సీట్ల విషయంలోనూ స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కర్నూలు టీడీపీలో అంతర్గత పోరు మొదలైంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top