కిరాయి కార్యకర్తల కోసం  అన్వేషణ!

Krishna District Telugu Desam Party Candidates are Getting Arrangements From Telangana to Hire Workers - Sakshi

సాక్షి, అమరావతి : నామినేషన్ల పర్వం మొదలైంది. పత్రాలు దాఖలు చేయడానికి వెళ్లాలంటే.. కనీసం వందమంది కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించాలి. అక్కడ నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు క్రమం తప్పకుండా ప్రచారం చేయాలి. నామినేషన్ల తర్వాత కిరాయి కార్యకర్తలు దొరకడం కష్టం అవుతుంది. వేసవి కావడంతో భవన నిర్మాణాలకు డిమాండ్‌ ఉంటుంది. అలాగే ఎండలకు భయపడి కార్యకర్తలు రెట్టింపు డబ్బులు ఇస్తే కాని రారు. అందువల్ల నెల రోజులకు జీతానికి కార్యకర్తలను మాట్లాడుతున్నారు.

నెల రోజులపాటు తమ వెంట ఉండేందుకు ముందుగానే మాట్లాడుకుంటున్నారు. నెలకు మాట్లాడుకున్నప్పటికీ వారానికి ఓసారి డబ్బులు తీసేసుకుంటున్నట్టు కిరాయి కార్యకర్తలను సరఫరా చేసే వన్‌ టౌన్‌కు చెందిన బ్రోకర్‌ ఒకరు తెలిపారు. ఒక్కో అభ్యర్థి కనీసం 50 మంది కిరాయి కార్యకర్తలను తమ వెంట ఉండే విధంగా మాట్లాడుకుంటున్నారు. కాగా పార్టీలో పనిచేసే ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఈ విధంగా కార్యకర్తలను సరఫరా చేస్తున్నారు.

ఎమ్మెల్యే అభ్యర్థి ఏ డివిజన్‌ లేదా గ్రామానికి వెళ్లినప్పుడు అక్కడ లోకల్‌గా పనిచేసే కార్యకర్తల సేవలను ఉపయోగించుకుంటున్నారు. కార్యకర్తలకు డబ్బులతోపాటు చీరలు, మద్యం, బిర్యానీ ప్యాకెట్లు అదనంగా సరఫరా చేస్తున్నారు. నాయకుడి మంచితనాన్ని బట్టి నెలకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు కిరాయి వసూలు చేస్తున్నారు. ముందుగా అడ్వాన్స్‌ తీసుకున్న తర్వాతే తమ కార్యకర్తల్ని మధ్యవర్తులు రంగంలోకి దింపుతున్నారు.  

తెలంగాణ నుంచి కార్యకర్తలు.. 
కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది అభ్యర్థులు తెలంగాణ నుంచి కూడా కిరాయి కార్యకర్తలు వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తెలంగాణ ఎన్నికల సమయంలో ఇక్కడ నుంచి ప్రచారం చేయడానికి వెళ్లిన టీడీపీ ప్రజాప్రతినిధులు అక్కడ కార్యకర్తలకు ఇచ్చే రేట్ల గురించి వాకబు చేశారు. ఇక్కడ రోజుకు రూ.500 నుంచి రూ.1000 వరకూ చెల్లించాల్సి వస్తోంది.

అదే తెలంగాణలోని అదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల నుంచి కార్యకర్తలు రూ.400కే వస్తుండటంతో విజయవాడ నగరానికి చెందిన ఓ అభ్యర్థి అక్కడ నుంచి సుమారు వందమందిని కిరాయికి పిలిపించారు. వారికి స్థానికంగా షెల్టర్‌ ఏర్పాటు చేశారు.  ఉదయం పూట టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తున్నారు.

రాత్రి ఖర్చులు మాత్రం కార్యకర్తలే పెట్టుకోవాల్సి ఉంటుందని తెలంగాణ నుంచి కార్యకర్తలను తీసుకువచ్చిన బీమ్లా నాయక్‌ తెలిపారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల నుంచి సుమారు 500 మంది కృష్ణా, గుంటూరు జిల్లాలకు వచ్చారని వివరించారు. తెలంగాణలో కూడా పార్లమెంట్‌ ఎన్నికలు ఉన్నాయి, కాబట్టి ఎన్నికల రోజుకు వెళ్లిపోతామని వారు అన్నారు.

వ్యవసాయ కూలీలను వదలడం లేదు.. 
తెలంగాణ నుంచి కృష్ణా జిల్లాకు వచ్చి ఇక్కడ చెరకు, పత్తి వంటి పంట పొలాల్లో పనిచేసి తిరిగి వెళ్లిపోతారు. ఇప్పుడు ఆ విధంగా వచ్చిన వార్ని నెల రోజులపాటు ఉండి తమకు ప్రచారం చేయమని కోరుతున్నారు. కూలికి వచ్చినవారికి రూ.300 నుంచి రూ.400 మాత్రమే చెల్లిస్తే.. ఉదయం, సాయంత్రం ప్రచారానికి తిరుగుతారని ముఠా మేస్త్రీలు చెబుతున్నారు. టికెట్‌ కేటాయింపుపై అనుమానాలున్న అభ్యర్థులు కూడా చివర నిమిషంలో టికెట్‌ లభిస్తే ఇబ్బంది పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top