
సాక్షి,బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం సిద్దరామయ్యపై అనాలోచితంగా ఆరోపణలు,వి మర్శలు చేసిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ నాలుకపై నియంత్రణలో పెట్టుకోవడం ఉత్తమమంటూ కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పరమేశ్వర్ మీడియాతో మాట్లాడారు.
బీజేపీ తరపున ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల బెంగళూరు నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ బీజేపీ సిద్ధాంతాలు, పరివర్తన ర్యాలీ, తమ ప్రభుత్వం సాధించి అభివృద్ధి గురించి ప్రస్తావించకుండా కేవలం సీఎం సిద్దరామయ్య లక్ష్యంగా విమర్శలు, ఆరోపణలు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని, నేరాలు,అవినీతి పెరిగిపోయిందని అందుకు సీఎం సిద్దరామయ్య అసమర్థ పాలనే కారణమంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపణలు గురివింద నలుపు సామెతను గుర్తు చేస్తున్నాయన్నారు. ఇటీవల మంగళూరులో హత్యకు గురైన దీపక్‌రావ్ హత్య వెనుక బీజేపీ కార్పోరేటర్ హస్తం ఉందంటూ ఆరోపించారు.