దాడులు చేయించడం మంచి సంస్కృతి కాదు

Kotamreddy Sridhar Reddy Slams Somireddy Chandramohan Reddy - Sakshi

ఆటోడ్రైవర్‌పై దాడి చేయాలని చూసిన తిరుమలనాయుడు వెనుక సోమిరెడ్డి ఉన్నారా..?

అనేక విద్యాసంస్థలపై దాడులను మంత్రి ప్రోత్సహిస్తున్నారా..?

తన కార్యాలయంపై దాడి వెనుక చంద్రమోహన్‌రెడ్డి హస్తం ఉందా..?

ప్రశ్నించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

నెల్లూరు(సెంట్రల్‌): ప్రశాంతమైన నెల్లూరులో దాడులు, హత్యలు చేయించడం మంచి సంస్కృతి కాదని, తిరుమలనాయుడిపై జరిగిన దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రూరల్‌ కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. తిరుమలనాయుడిపై జరిగిన దాడి విషయంలో తాను మొదటి నుంచి ఖండిస్తున్నానని, దాడి ఎవరు చేసినా కఠినంగా శిక్షించాలని చెప్పారు. రెండు రోజుల క్రితం దాడి చేసిన ఏడుగుర్ని అరెస్ట్‌ చేశామని పోలీసులు చెప్పారని, అయితే వాళ్లు దాడులు చేశారా.. లేదాననేది ఇప్పటికీ అనుమానంగానే ఉందని చెప్పారు. పోలీస్‌ వ్యవస్థపై నమ్మకంతో ఉన్నానని తెలిపారు. దాడిలో తనపై నిందలు మోపే ముందు తిరుమలనాయుడి అరాచకాలపై కూడా సోమిరెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

అనేక విద్యాసంస్థలపై దాడులు చేశారు..
ఇటీవల మినీబైపాస్‌రోడ్డులో ఆటోకు ‘నిన్ను నమ్మం బాబు’ అనే స్టిక్కర్‌ వేసుకున్నందుకు ఆటోడ్రైవర్‌పై తిరుమలనాయుడు దాష్టీకానికి పాల్పడ్డారని ఆరోపించారు. దీన్ని సోమిరెడ్డి చేయించారానని ప్రశ్నించారు. అనేక విద్యాసంస్థలపై తిరుమలనాయుడు దాడులు చేసి, బెదిరింపులకు దిగిన సందర్భాలు ఉన్నాయని, ఈ ఘటనల వెనుక చంద్రమోహన్‌రెడ్డి హస్తం ఉందానని ప్రశ్నించారు. తిరుమలనాయుడికి అనేక మందితో వ్యక్తిగత గొడవలు ఉన్నాయని, వీటికీ.. సోమిరెడ్డికి సంబందాలు ఉన్నాయా..? తన కార్యాలయంపై మేయర్‌ అజీజ్‌ సోదరుడు జలీల్‌ సమక్షంలో కొందరు మారణాయుధాలతో వచ్చి దాడులు చేశారని ఆరోపించారు. ఈ దాడిని సోమిరెడ్డి చేయించారానని ప్రశ్నించారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని నిడిగుంటపాళెంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలపై సోమిరెడ్డి మనుషులు అకారణంగా, అమానుషంగా దాడులు చేశారని.. ఈ దాడులను ఎవరి ప్రోద్బలంలో చేశారో చెప్పాలన్నారు. కావలిలో అనేక చోట్ల దాడులు జరిగాయని, దీని వెనుక బీదా రవిచంద్ర హస్తం ఉందానని ప్రశ్నించారు. ఏదైనా దాడి జరిగితే దాన్ని తనకు అంటగట్టడం సిగ్గుచేటని విమర్శించారు.

జనసేన తరఫున సోమిరెడ్డి బంధువుల ప్రచారం
నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అజీజ్‌కు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వెన్నుపోటు పొడవలేదానని ప్రశ్నించారు. సర్వేపల్లిలో సోమిరెడ్డి తరఫున ప్రచారం చేసిన ఆయన  రక్తసంబంధీకులు, నెల్లూరు రూరల్‌లో జనసేన తరఫున ప్రచారం చేసిన మాట వాస్తవం కాదానని ప్రశ్నించారు. జనసేన అభ్యర్థి మనుక్రాంత్‌రెడ్డి సోమిరెడ్డికి అల్లుడు అనేది నిజం కాదానన్నారు. టీడీపీలో ఉండే వారికే వెన్నుపోటు పొడిచే మంత్రి సోమిరెడ్డి తనపై నిందలు వేయడం సిగ్గుచేటని, ఇలాంటి రాజకీయాలను మానుకోవాల్సిందిగా హితవు పలికారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top