
బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి (పాత ఫొటో)
సాక్షి, గుంటూరు : టీడీపీ నేతల ఊసరవెళ్లి రాజకీయాలను జనం గమనిస్తూనే ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విభజన హామీలను సాధించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు.
ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే పోరాటం చేస్తోందన్నారు. చిత్తశుద్ధి ఉండబట్టే ఇంకా సంవత్సరం సమయం ఉన్నా తమ పార్టీ ఎంపీలు పదవులను తృణప్రాయంగా వదిలేశారని.. ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారని తెలిపారు. దీక్షలు, పోరాటాలు వైఎస్సార్ సీపీకే సాధ్యమని.. తమతోనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.