‘ఓటుకు కోట్లు కేసు’లో ఇరుక్కున్నా సిగ్గులేదా?: కేసీఆర్‌

KCR Slams Chandrababu Over Cash For Vote Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఉన్న ఆంధ్రా వాళ్ల పాలిట శని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడేనని టీఆర్‌ఎస్‌ అధినేత, ఆపద్దర్మ సీఎం కేసీఆర్‌ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఎన్నికల ప్రణాళిక కమిటీతో సమావేశం అనంతరం మీడియా సమావేశంలో పాక్షిక మేనిఫెస్టోను ప్రకటించారు. పూర్తి మేనిఫెస్టో సిద్ధమయ్యేలోగా ఇప్పటికే నిర్ణయించిన కొన్ని ముఖ్యమైన హామీలతో ప్రజల దగ్గరికి వెళ్లాలని టీఆర్‌ఎస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. మేనిఫెస్టో ప్రకటించిన అనంతరం టీడీపీ-కాంగ్రెస్ కూటమిపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయడు వైఖరిని ఎండగట్టారు. ఇంకా ఏమన్నామరంటే ఆయన మాటల్లోనే..

వాళ్లు తెలంగాణ పౌరులే
‘తెలంగాణలో చంద‍్రబాబు పార్టీకి డిపాజిట్లు వస్తాయా? చంద్రబాబు తెలంగాణలో రాజ్యమేలుతాడా? ఇప్పటికే ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కున్నా సిగ్గులేదా? నువ్వు వ్యక్తివి, రాజకీయ నేతవి కాబట్టి బరాబర్‌ అంటాం. చంద్రబాబునంటే ఆంధ్రా వాళ్లను అన్నట్టు కాదు. చంద్రబాబు పోతే కబ్జాలు, జూదాలు, పేకాటక్లబ్‌లు పోయాయి. తెలంగాణలో ఉన్న ఆంధ్రా వాళ్ల పాలిట శని చంద్రబాబు. ఆంధ్రా నుంచి ఎప్పటి నుంచో వచ్చి ఇక్కడ ఉంటున్నారు. మేం 15 మందికి కార్పొరేట్‌ టికెట్లు ఇస్తే 12 మంది ఆంధ్రా వాళ్లు గెలిచారు. ఏడెనిమిది ఆంధ్రావాళ్లకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చాం. ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు. వాళ్లు తెలంగాణ పౌరులే. మాకైతే పొత్తు అవసరం లేదు. పోయి పోయి చంద్రబాబుతో పొత్తా? (టీఆర్‌ఎస్‌ పాక్షిక మేనిఫెస్టో ఇదే)

ఆయనకు వయసు పైబడింది
డిసెంబర్‌లో చాలా పెద్ద పరిణామాలు ఉంటాయి. గడ్డం ఉంచుకునేవారెవరో..గీసుకునేవారెవరో తెలస్తుంది. అన్ని సర్వేలు టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని చెప్తున్నాయి. సుస్థిరమైన రాజకీయ వ్యవస్థ తెలంగాణకు అవసరం. వంద సీట్లు దాటడమే మా టార్గెట్‌. గతంలో ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే అన్ని స్ధానాలు గెలుచుకున్నాం. ఇప్పుడు ఐదారు జిల్లాలో అన్ని స్థానాలు కైవసం చేసుకుంటాం. గతంలో హైదరాబాద్‌, ఖమ్మంలో ఒకో సీటు వచ్చాయి. ఇప్పుడు పుంజుకున్నాం. ఎమ్మెల్యే టికెట్‌ ఆశించడం తప్పుకాదు. ఒక్క అభ్యర్థిని కూడా మార్చేది లేదు. జైపాల్‌రెడ్డి వయసు పైబడి బ్యాలెన్స్‌ తప్పి మాట్లాడుతున్నారు. నూటికి నూరు శాతం గెలుస్తాం. గతంలో జరిగిన అవినీతిని బయటపెడతాం’అంటూ కేసీఆర్‌ పేర్కొన్నారు.  (కేసీఆర్‌పై గద్దర్‌ పోటీ)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top