నేడే శంఖారావం | KCR Samara Shankaravam in Hyderabad LB Stadium | Sakshi
Sakshi News home page

నేడే శంఖారావం

Mar 29 2019 7:54 AM | Updated on Apr 3 2019 12:20 PM

KCR Samara Shankaravam in Hyderabad LB Stadium - Sakshi

సాక్షి, హైదరాబాద్‌(సిటీబ్యూరో): గ్రేటర్‌ పరిధిలోని లోక్‌సభ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అఖండ విజయం సాధించే దిశగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం సమర శంఖారావం పూరించనున్నారు. ఎల్‌బీ స్టేడియంలో సాయంత్రం 5.30 గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొని కార్యకర్తలకు, పార్టీ అభిమానులకు దిశానిర్దేశం చేసి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాల పార్టీ అభ్యర్థులు సాయికిరణ్‌ యాదవ్, మర్రి రాజశేఖర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి అత్యధిక మెజార్టీ సాధించేందుకు పార్టీ కేడర్‌ను కేసీఆర్‌ సమాయత్తం చేయనున్నారు. ఈ బహిరంగ సభకు మూడు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేసే బాధ్యతలను నగర మంత్రులు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఇతర ప్రజా ప్రతినిధులకు అప్పజెప్పారు.

సభ నేపథ్యంలో గులాబీ జెండాలు, స్వాగత తోరణాలతో సిటీ గులాబీ వనమైంది. ఎల్‌బీ స్టేడియంలోనూ భారీగా ఏర్పాట్లు చేశారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో  సాధించిన ఘనవిజయంతో మంచి ఊపుమీదున్న అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ.. లోక్‌సభ ఎన్నికల్లోనే అదే విజయాన్ని అందుకోవాలని చూస్తోంది. మహానగరంలోని మూడు లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఈ బహిరంగ సభతో ప్రచార హోరును పెంచనుంది. పార్టీకి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, క్యాడర్‌ బలంగా ఉన్నప్పటికీ అభ్యర్థులు కొత్తవారు కావడంతో ప్రచారపర్వాన్ని సీనియర్ల భుజాలపై వేశారు. ఈ క్రమంలో పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్‌కు పార్టీ శ్రేణులకు ఈ బహిరంగ సభ ద్వారా దిశానిర్దేశం చేయనున్నారు. మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఇప్పటికే సిద్ధం చేసిన ప్రణాళికలు, పూర్తిచేసిన పథకాలను సీఎం కేసీఆర్‌ ప్రస్తావించనున్నారు. గులాబీ బాస్‌ సభతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంటుందని, తమ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ఆ పార్టీ శ్రేణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. 

నేడు ట్రాఫిక్‌ మళ్లింపు..
లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా నగర పోలీసు విభాగం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభకు వచ్చే జన సందోహం కోసం సభ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు ఇవి అమలులో ఉంటాయని ట్రాఫిక్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

వాహనాల మళ్లింపు ఇలా..
ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌ నుంచి బీజేఆర్‌ స్టాట్యూ వైపు వచ్చే ట్రాఫిక్‌ను నాంపల్లి, రవీంద్రభారతి వైపు పంపిస్తారు.
అబిడ్స్, గన్‌ఫౌండ్రీ వైపు నుంచి బీజేఆర్‌ స్టాట్యూ, బషీర్‌బాగ్‌ జంక్షన్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌ను చాపెల్‌ రోడ్‌ వైపు మళ్లిస్తారు.
బషీర్‌బాగ్‌ జంక్షన్‌ నుంచి జీపీఓ, అబిడ్స్‌ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను హైదర్‌గూడ, కింగ్‌కోఠి మీదుగా పంపిస్తారు.
ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి బషీర్‌బాగ్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌ను హిమాయత్‌నగర్‌ ‘వై’ జంక్షన్‌ మీదుగా మళ్లిస్తారు.
కింగ్‌కోఠి భారతీయ విద్యాభవన్‌ నుంచి బషీర్‌బాగ్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌ను తాజ్‌మహల్‌ హోటల్‌ మీదుగా పంపిస్తారు.
లిబర్టీ నుంచి బషీర్‌బాగ్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌ను హిమాయత్‌నగర్‌ వైపు, ట్రాఫిక్‌ కంట్రోల్‌ నుంచి బషీర్‌బాగ్‌ వైపు వచ్చే వాహనాలను నాంపల్లి వైపు పంపిస్తారు.  
సభకు వచ్చే వారికి ప్రత్యేక పార్కింగ్‌ సదుపాయాలు కూడా కల్పించారు. 

పరిస్థితిని సమీక్షించిన సిటీ ట్రాఫిక్‌ చీఫ్‌  
ఎల్‌బీ స్టేడియంలో శుక్రవారం టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సభ, ఆదివారం బీజేపీ బహిరంగ సభ ఉన్నందున ఆయా సభలకు ప్రముఖుల హాజరు, రాకపోకలు అధికంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై సిటీ ట్రాఫిక్‌ చీఫ్‌ అనిల్‌ కుమార్‌ గురువారం సమీక్షించారు. ఆయా ప్రాంతాల్లో అధిక సిబ్బందిని మోహరించడం ద్వారా ట్రాఫిక్‌ చిక్కులు లేకుండా చూడాలని ఆదేశించారు.  

సైబరాబాద్‌ పరిధిలో ట్రాఫిక్‌ ఇలా..
ఎల్‌బీస్టేడియంలో నేడు జరిగే టీఆర్‌ఎస్‌ పార్టీ బహిరంగ సభ నేపథ్యంలో సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. వివిధ ప్రాంతాల నుంచి స్టేడియానికి భారీగా వాహనాల్లో రానుండటంతో సాఫీ ట్రాఫిక్‌ నిర్వహణ కోసం చర్యలు చేపట్టారు.  
శంషాబాద్, రాజేంద్రనగర్‌ నుంచి ఎల్‌బీ స్టేడియం వచ్చే వాహనదారులు అరాంఘర్, ఎన్‌పీఏ, బహూదూర్‌పురా, సిటీ కాలేజ్, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్‌ మీదుగా రావాలి. పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వే, అత్తాపూర్, మెహదీపట్నం, లక్డీకాపూల్‌ నుంచి ఎల్‌బీ స్టేడియం చేరుకోవచ్చు. అయితే భారీ వాహనాలకు పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వే పై అనుమతి లేదు. ఫ్లైఓవర్‌ కింది నుంచి రావాలి.  
తాండారు, వికారాబాద్, చేవెళ్ల నుంచి వచ్చే వాహనాలు లంగర్‌హౌస్, మెహదీపట్నం, లక్డీకాపూల్‌ మీదుగా చేరుకోవాలి.
శంకర్‌పల్లి నుంచి వచ్చే వాహనదారులు మోఖిలా, నార్సింగి, మెహదీపట్నం, లక్డీకాపూల్‌ నుంచి స్టేడియానికి చేరుకోవాలి.
మేడ్చల్, అల్వాల్, పేట్‌బషీరాబాద్‌ నుంచి వచ్చే వాహనాలు బోయిన్‌పల్లి, బేగంపేట, రాజ్‌భవన్, ఖైరతాబాద్, లక్డీకాపూల్‌ నుంచి స్టేడియానికి చేరుకోవాలి.
శామీర్‌పేట, అల్వాల్‌ నుంచి వచ్చే వాహనదారులు జూబ్లీహిల్స్‌ బస్టాండ్, బేగంపేట, రాజ్‌భవన్, ఖైరతాబాద్, లక్డీకాపూల్‌ నుంచి స్టేడియానికి చేరుకోవాలి.
దుండిగల్, జీడిమెట్ల, బాలానగర్‌ నుంచి వచ్చే వాహనదారులు ఫతేనగర్, బేగంపేట, రాజ్‌భవన్, ఖైరతాబాద్, లక్డీకాపూల్‌ నుంచి ఎల్‌బీ స్టేడియానికి చేరుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement