పటేల్‌ స్ఫూర్తితోనే కశ్మీర్‌కు విముక్తి: మోదీ

Kashmir And Ladakh New Step For Future From Today Says Modi - Sakshi

పటేల్‌ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ

గాంధీ నగర్‌: కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370 రద్దు ద్వారా అక్కడ నూతన అధ్యాయం ప్రారంభంకాబోతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అనేక రాజకీయ ఒడిదొడుకులు, మత కల్లోలాలు ఎదుర్కొన్న కశ్మీర్‌ నేటి నుంచి కొత్త జీవితంలోకి అడుగుపెడుతోందని పేర్కొన్నారు. కశ్మీర్‌ కొత్త చరిత్రను నేడు శ్రీకారం చుట్టామని చెప్పారు. ఉక్కుమనిషి సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ 144వ జయంతి సందర్భంగా గుజరాత్‌లో జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. పటేల్‌ స్ఫూర్తితోనే కశ్మీర్‌ విముక్తి జరిగిందని మోదీ గుర్తుచేశారు. సభలో ప్రధాని మాట్లాడుతూ.. ‘కశ్మీర్‌కు శాపంగా మారిన ఆర్టికల్‌ 370 వల్ల ఉగ్రవాదం పెద్ద ఎత్తున బలపడింది. ఉగ్రవాదులకు  భారత్‌లో కశ్మీర్‌ అడ్డాగా మారింది. గడిచిన మూడు దశాబ్దాల్లో 40 వేలకు పైగా కశ్మీరీ పౌరులు ప్రాణాలను కోల్పోయారు. ఎంతో మంది తల్లులు బిడ్డల్ని కోల్పోయారు. వారి చర్యల కారణంగా హిమాలయ భూమి రక్తపాతంగా మారింది. భవిష్యత్తులో ఉగ్రవాద సమస్యను పూర్తిగా నిర్మూలించే సంకల్పంతోనే ఆర్టికల్‌ 370ని రద్దు చేశాం. ఈ నిర్ణయాన్ని యావద్దేశం స్వాగతించింది.’ అని అన్నారు.

ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్‌ అప్పట్లో రాజ్యాంగంలో జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని ఆగస్టు 5న రద్దు చేసిన విషయం తెలిసిందే. కశ్మీర్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టానికి ఓకే చెప్పగా.. పటేల్‌ జయంతి అయిన నేటి నుంచి చట్టం అమల్లోకి వచ్చింది. బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు అమల్లోకి వచ్చిన ఈ చట్టంతో 173 ఏళ్ల చరిత్ర కలిగిన జమ్మూ కశ్మీర్‌ కథ ఇక గతం. జమ్ము కశ్మీర్, లదాఖ్‌ ప్రాంతాలు కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఈ చట్టం ప్రకారం అసెంబ్లీ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్మూకశ్మీర్, పూర్తి స్థాయి కేంద్రపాలిత ప్రాంతంగా లదాఖ్‌ అవతరించాయి.  జమ్మూ కశ్మీర్‌ కొత్త లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ (ఎల్‌జీ) గా ఐఏఎస్‌ అధికారి గిరీశ్‌ చంద్ర ముర్ము, లదాఖ్‌ ఎల్‌జీగా ఆర్‌కే మాథూర్‌లను కేంద్రం నియమించింది. గురువారం శ్రీనగర్, లేహ్‌లలో జరిగే కార్యక్రమాల్లో ఈ ఇద్దరు లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్స్‌ పదవీ ప్రమాణం చేశారు.

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top