‘మహేశ్వరి ముక్కు, చెవులు కోస్తాం...’

Karni Sena Threatens Rajasthan Minister Kiran Maheshwari On Rat Remarks - Sakshi

జైపూర్‌ : రాజ్‌పుత్‌ కర్ణిసేన మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది. రాజస్థాన్‌ విద్యా శాఖ మంత్రి కిరణ్‌ మహేశ్వరి రాజ్‌పుత్‌లను ఎలుకలతో పోల్చినందుకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసింది. అలా జరగని పక్షంలో ఆమె ముక్కు, చెవులు కోస్తామని కర్ణిసేన బెదిరింపులకు పాల్పడింది.

వివరాలు... సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మహేశ్వరి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ‘సర్వ్‌ రాజ్‌పుత్‌ సమాజ్‌ సంఘర్ష్‌ సమితి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించబోతున్న వార్తలు నిజమేనా’ అన్న ప్రశ్నకు బదులుగా.. ‘వర్షాకాలంలో కలుగు నుంచి బయటికి వచ్చే ఎలుకల లాంటి కొందరు వ్యక్తులు ఎన్నికల సమయంలో బయటకు వస్తారంటూ’  ఆమె వ్యాఖ్యానించారు.

మహేశ్వరి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణిసేన... ‘దీపికా పదుకొనె ‘పద్మావతి వివాదాన్ని’ మహేశ్వరి మర్చిపోయినట్టున్నారు. రాజ్‌పుత్‌ల వల్లే బీజేపీకి రాజస్థాన్‌లో బలం చేకూరింది. మహేశ్వరి అన్నట్లే ఆమె నియోజక వర్గంలో ఉన్న 40 వేల ఎలుకల వల్లే గత ఎన్నికల్లో గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో ఆమెకు తప్పక బుద్ధి చెప్తామంటూ’ మండిపడింది. ‘మహేశ్వరి వెంటనే క్షమాపణలు చెప్పాలి. ప్రభుత్వం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. మేము మహిళలకు గౌరవం ఇస్తాం. కానీ హద్దులు దాటి మాట్లాడే మహిళలను ఎన్నటికీ సహించబోమంటూ’  కర్ణిసేన చీఫ్‌ మహిపాల్‌ మక్రానా వీడియో విడుదల చేశారు.

కాగా ఈ విషయంపై స్పందించిన మహేశ్వరి మాట్లాడుతూ...తాను రాజ్‌పుత్‌ల గురించి ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు. రాజకీయ ప్రత్యర్థులను(కాంగ్రెస్‌ పార్టీని) ఉద్దేశించే అలా మాట్లాడానని చెప్పారు.

క్షమాపణలు చెప్పాల్సిందే : సచిన్‌ పైలట్‌
రాజ్‌పుత్‌లను అవమానించిన మహేశ్వరి వెంటనే క్షమాపణలు చెప్పాలని రాజస్థాన్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ సచిన్‌ పైలట్‌ డిమాండ్‌ చేశారు. ప్రజల మనోభావాలకు విలువ ఇచ్చే సంస్కృతి బీజేపీకి లేదని విమర్శించారు. తమను తాము రక్షించుకోవడానికి బీజేపీ నేతలు ఎంతకైనా దిగజారుతారంటూ వ్యాఖ్యానించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top