ముగ్గురు రెబెల్స్‌పై అనర్హత వేటు

Karnataka Speaker disqualifies three rebel Congress MLAs  - Sakshi

కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ సంచలన నిర్ణయం

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రమేశ్, మహేశ్, శంకర్‌లపై అనర్హత

సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌ కె.ఆర్‌.రమేశ్‌ కుమార్‌ గురువారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌–జేడీఎస్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన 17 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలైన రమేశ్‌ జార్కిహోళి, మహేశ్‌ కుమటల్లి, శంకర్‌లపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేసినట్లు స్పీకర్‌ తెలిపారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా  రాజీనామాలు ఇవ్వలేదనీ, రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌(ఫిరాయింపుల నిరోధక చట్టం)ను ఉల్లంఘించారని స్పష్టం చేశారు.

ప్రస్తుత శాసనసభ కాలం ముగిసే వరకూ (2023) వీరు ఎన్నికల్లో పోటీ చేసేందుకు, సభలో పదవులు చేపట్టేందుకు అనర్హులని తేల్చిచెప్పారు. మిగిలిన 14 మంది ఎమ్మెల్యేల రాజీనామాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటానన్నారు. అసెంబ్లీలో ఇటీవల జరిగిన విశ్వాసపరీక్షలో కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఓడిపోవటం తెలిసిందే.  తన నిర్ణయంపై రెబెల్స్‌ కోర్టులకు వెళ్లే అవకాశముందన్నారు. ఆర్థిక బిల్లుకు గనక ఈ నెల 31లోగా  ఆమోదం లభించకపోతే ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందని, అప్పుడు అసెంబ్లీని సస్పెండ్‌ చేయడం లేదా రాష్ట్రపతి పాలన విధించడం తప్ప మరో ప్రత్యామ్నాయం ఉండదని చెప్పారాయన. మరోవైపు తమ రాజీనామాలపై స్పీకర్‌ ముందు హాజరై వివరణ ఇచ్చేందుకు 4 వారాల గడువు కావాలని రెబెల్స్‌ కోరారు.

యెడ్డీ జోరుకు షా బ్రేక్‌..
బీజేపీ కర్ణాటక చీఫ్‌ యడ్యూరప్ప, నేతలు జగదీశ్‌ షెట్టర్, అరవింద్‌ లింబావలి, మధుస్వామి, బసవరాజ్‌ బొమ్మై గురువారం ఢిల్లీ చేరారు. పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షాతో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. అయితే మిగిలిన 14 మంది రెబెల్‌ ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ తుది నిర్ణయం తీసుకున్న తరవాతే ముందుకెళ్లాలనీ, అప్పటివరకూ ఓపికపట్టాలని యడ్యూరప్పకు షా సూచించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top