కాంగ్రెస్‌పై సంచలన ఆరోపణలు చేసిన కుమారస్వామి..!

Karnataka CM HD Kumaraswamy Says JDS Will Not Backstab Even If They Do - Sakshi

మాండ్య : మిత్ర ధర్మం మరిచి తమ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌లోని కొందరు నాయకులు పనిచేస్తున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి సంచలన ఆరోపణలు చేశారు. ‘జేడీఎస్‌ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే, వారి వేగాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్‌లోని కొందరు నాయకులు పనిచేస్తున్నారు. కానీ మేమలా చేయం. జేడీఎస్‌ నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమి అభ్యర్థుల విజయానికినిస్వార్థంగా శ్రమిస్తారు. మాకు దేశ ప్రయోజనాలే ముఖ్యం’ అని కుమారస్వామి అన్నారు. మాండ్య లోక్‌సభ స్థానం నుంచి జేడీఎస్‌ తరపున కుమారస్వామి తనయుడు నిఖిల్‌ పోటీకి దిగుతుండగా.. సుమలత అంబరీష్‌ ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్నారు.
(చదవండి : ఆట మొదలైంది!)

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న ఎనిమిది మంది జేడీఎస్‌ అభ్యర్థులను విజయానికి వ్యూహాలను సిద్ధం చేశామని, అసమ్మతులు, కుట్రల గురించి తాము పట్టించుకోవడం లేదని కుమారస్వామి చెప్పారు. మాండ్య ప్రజలు కూడా నిఖిల్‌కు మద్దతుగా నిలుస్తారన్నారు. ‘కొంతమంది డబ్బులు, కానుకలతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి ఓట్లు పొందాలని ప్రయత్నిస్తున్నారు. అటువంటి ప్రలోభాలకు మండ్య జిల్లా ప్రజలు లొంగరు. మండ్యలో నిఖిల్‌ ఒక్కడిని ఓడించడానికి అందరూ ఏకమయ్యారు. వారికి బీజేపీ కూడా తోడైంది. ఎంతమంది ఏకమైనా ఎన్ని వ్యూహాలు సిద్ధం చేసినా నిఖిల్‌ వాటన్నింటిని బద్దలు కొట్టి అత్యధిక మెజారిటీతో గెలుపొందుతారు. నిఖిల్‌కు మద్దతు ఇవ్వాలంటూ కాంగ్రెస్‌ నేత చెలువనారాయణస్వామిని మేం కోరబోమని స్పష్టం చేశారు. 

మేం కేబుల్‌ కట్‌ చేయలేదు 
నిబద్దత, నిజాయితీ గురించి తాము ఎవరి నుంచి పాఠాలు చెప్పించుకోవాల్సిన అవసరం లేదని సుమలత అంబరీష్‌పై కుమారస్వామి పరోక్ష విమర్శలు చేశారు. సుమలత నామినేషన్‌ దాఖలు చేసే రోజు ప్రజలు భారీగా తరలివచ్చారని ఈ దృశ్యాలను చూడలేక కేబుల్‌ కట్‌ చేయించామంటూ వచ్చిన వార్తలపై స్పందిస్తూ..తమకు అటువంటి అవసరం లేదన్నారు. అదేరోజు ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోతే తామేం చేయగలమన్నారు.  కాగా, సుమలతకు బీజేపీ బహిరంగంగా మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.  కర్ణాటకలో ఉన్న మొత్తం 28 లోక్‌సభ స్థానాలకు రెండు దశల్లో (ఏప్రిల్‌ 18, ఏప్రిల్‌ 23) పోలింగ్‌ జరగనుంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top