
సాక్షి, విజయనగరం : ప్రధాని నరేంద్రమోదీ మచ్చలేని నాయకుడని విశాఖపట్నం ఎంపీ, బీజేపీ మాజీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అన్నారు. శుక్రవారం విజయనగరంలో జరిగిన విసృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ బలమైన శక్తిగా ఎదగడానికి అవసరమైన నాయకత్వం ఉందని తెలిపారు. కేంద్రం ఎన్నో పధకాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తోందని వెల్లడించారు. కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు అని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై పడి ఏడుస్తోందని ఎద్దేవా చేశారు.
ప్రస్తుతం బీజేపీ ఇచ్చే స్థితిలో ఉందని అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో, నల్లధనాన్ని వెలికి తీయడంలో, దేశ వ్యాప్తంగా ఒకే పన్ను విధానం కోసం జీఎస్టీ తీసుకు రావడం జరిగిందని వెల్లడించారు. దీని వల్ల దేశంలో ఆర్థిక పరిస్థితి బలోపేతం అయ్యిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగితేనే అభివృద్ధి సాధ్యపడుతుందని భావించామని, అందుకే విభజనకు అంగీకరించినట్లు తెలిపారు. విశాఖ, విజయనగరం జిల్లాలు జంట నగరాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని అన్నారు.