కేంద్రానికి వ్యతిరేకంగా స్వరం.. కేబినెట్‌లోకి ఆహ్వానం!

JDU May Get Cabinet Berth In Modi Cabinet - Sakshi

జేడీయూకి రెండు కేంద్రమంత్రి పదవులు!

పట్నా : ఎన్‌ఆర్‌సీ, సీఏఏకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న బీజేపీ మిత్రపక్షం జేడీయూను శాంతిపరిచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రంగంలోకి దిగారు. జేడీయూని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉన్న బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ గత కొంత కాలంగా కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన స్వరాన్ని వినిపిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం, ఎన్‌ఆర్‌సీ, రానున్న అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాలు వంటి అంశాలపై జేడీయూ-బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. (బీజేపీకి ప్రశాంత్‌ కిషోర్‌ అల్టిమేటం..!)

ఈ నేపథ్యంలో జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ కిషోర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేయడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సీట్ల ఒప్పదంలో సింహభాగం తామే పోటీ చేస్తామని, బీజేపీ ప్రతిపాదనకు తలొగ్గేది లేదంటూ తేల్చి చెప్పారు. బీజేపీకి గుడ్‌బై చెప్పి విపక్షాలకు చేతులు కలిపేందుకు కూడా నితీష్‌ సిద్ధంగా ఉన్నారంటూ సంకేతాలు కూడా ఇచ్చారు. దీంతో వెంటనే తేరుకున్న మోదీ, షా ద్వయం నష్టనివారణ చర్యలను చేపట్టింది. జేడీయూని కేంద్రమంత్రివర్గంలోకి తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఇద్దరికి కేబినెట్‌లో చోటు దక్కనుందని సమాచారం. కాగా ప్రభుత్వం ఏర్పడిన సమయంలో కేవలం ఒక్కరికే మంత్రిపదవి ఇస్తామని బీజేపీ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. 

దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నితీష్‌.. ఒక్క పదవి తమకు అవసరం లేదని తిరస్కరించారు. దీంతో మోదీ తొలి మంత్రివర్గ విస్తరణలో జేడీయూకి చోటుదక్కలేదు. ఎన్డీయే అతిపెద్ద భాగస్వామ్యపక్షం శివసేన మంత్రిమండలి నుంచి వైదొలగడం, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా నితీష్‌ గళం విప్పడం వంటి ప్రభుత్వ వ్యతిరేక పరిణామాలు చకచక జరిగిపోయాయి. మరోవైపు బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు గడువు దగ్గరపడుతుండంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. జేడీయూని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు అంగీకరించింది. శుక్ర, శనివారాల్లో వారుమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top