కొందరికి లబ్ధి కోసమే రాజధానిపై లీకులు

IYR Krishna Rao Comments On TDP Govt - Sakshi

‘నవ్యాంధ్రతో నా నడక’పుస్తకంలో మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ వెల్లడి 

రోజుకో విధంగా ముఖ్యమంత్రి లీకులు ఇప్పించారు 

ప్రజలపై ప్రభుత్వం చాలా అన్యాయంగా ట్రిక్కులు ప్లే చేసింది 

మధ్య తరగతి ప్రజలను మోసగించి కొందరికి లాభం చేకూర్చారు 

మనీ లాండరింగ్‌కు సింగపూర్‌ కేంద్రం 

సింగపూర్‌ ప్రభుత్వంతో టీడీపీ ప్రభుత్వం అంటకాగింది 

ఆ దేశ కంపెనీలకు ఇచ్చింది స్విస్‌ చాలెంజ్‌ విధానం కాదు

సాక్షి, అమరావతి: రాజధాని ఎక్కడ అనే విషయంలో రోజుకో విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు లీకులు ఇచ్చారని, దీనివల్ల మధ్య తరగతి ప్రజలు మోసపోగా కొందరికి ప్రయోజనం చేకూరిందని విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ తొలి ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు వెల్లడించారు. సింగపూర్‌ కంపెనీలకు స్టార్టప్‌ ఏరియా పేరుతో రాజధానిలో 1,691 ఎకరాలను ఇవ్వడంలో, రాజధానికి భూములు గుర్తింపులో ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరించిన స్వార్థపూరిత వైఖరిని ‘నవ్యాంధ్రతో నా నడక’ పేరుతో రచించిన తన పుస్తకంలో ఐవైఆర్‌ బహిర్గతం చేశారు. దీంతో రాజధాని విషయంలో సీఎం చంద్రబాబు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ తొలినుంచీ చెబుతున్న విషయాన్ని ఐవీఆర్‌ ధ్రువీకరించినట్లయింది. ఐవైఆర్‌ తన పుస్తకంలో రాజధాని రాజకీయం పేరుతో  ఓ అధ్యాయం కేటాయించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.  

శివరామకృష్ణన్‌ కమిటీని కాదని.. 
రాజధాని గుర్తింపునకు కేంద్రం శివరామకృష్ణన్‌ కమిటీని ఏర్పాటు చేసింది. అయినప్పటికీ చంద్రబాబు నిపుణులతో కాకుండా వ్యాపారస్తులు, పార్టీ నేతలతో మరో కమిటీని ఏర్పాటు చేశారు. సీఎస్‌గా ఉన్న నన్ను తొలుత కమిటీకి సభ్య కన్వీనర్‌గా పెట్టారు. ఈలోపు ఎవరో వెళ్లి నేను దొనకొండను రాజధానికి ప్రతిపాదించినట్లు సీఎంకు చెప్పారు. దీంతో సీఎం నన్ను ఈ కమిటీ నుంచి తీసేశారు. రెండు, మూడు నెలల తర్వాత శివరామకృష్ణన్‌ అనుకోకుండా సీఎం దగ్గర తటస్థ పడ్డారు. మీ గురించి విన్నాను. మీ కాన్సెప్ట్‌ నోట్‌ చదివాను. చాలా బాగుందని శివరామకృష్ణన్‌ చెప్పారు. అప్పుడు సీఎం ముఖం చిన్నబోయింది. ఈలోపు చంద్రబాబు ఆలోచనలో ఉన్న రాజధానిని ఆచరణలో పెట్టడం ప్రారంభించారు. నిజానికి ఆయన నియమించిన కమిటీ రాజధాని  ఎక్కడనేది తేల్చలేదు. కానీ లీకులు రావడం ప్రారంభమయ్యాయి. నూజివీడు దగ్గర అటవీ ప్రాంతాన్ని డీనోటిఫై చేసి రాజధాని నిర్మిస్తారని ఒక రోజు, గుంటూరు–విజయవాడల మధ్య నాగార్జున వర్సిటీ భవనాల్లో రాజధాని పెడతారని మరో రోజు, మంగళగిరి వద్ద అటవీ భూములను డీనోటిఫై చేసి రాజధాని నిర్మిస్తారని ఇంకోరోజు లీకులు వదిలారు.  

మధ్య తరగతిని మోసం చేసి.. 
భూములు అమ్మకాల ద్వారా మధ్య తరగతిని మోసగించి కొందరికి ప్రయోజనం చేకూర్చేందుకే ఆ లీకులు సృష్టించారు. తుళ్లూరు మండలంలో రాజధాని వస్తుందని ముందస్తు సమాచారం ఉన్నవారు వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టి స్పెక్యులేటివ్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ద్వారా కోట్ల రూపాయలు ఆర్జించేందుకు తోడ్పడేలా ప్రభుత్వం ఈ సయ్యాటలాడింది. చివరకు ఎటువంటి అధ్యయనం లేకుండా వెలగపూడిలో రాజధానిని నిర్ణయించారు. అమరావతి కోసం 32 వేల ఎకరాలను సేకరించారు. ల్యాండ్‌ పూలింగ్‌లో తీసుకుని ఆ రైతుల్లో ఎలాంటి భ్రమ కల్పించారంటే, వాళ్లందరికీ విపరీతమైన రేట్లు వస్తాయనే భ్రమలో తమ భూములు ఇచ్చేశారు. వాళ్లనుకున్న స్థాయిలో లాభాలు రావాలంటే ఇది ఏ హైదరాబాదో, మద్రాసు స్థాయి కావాలి. అలా కావడానికి ఎన్ని ఏళ్లు పడుతుంతో చెప్పలేం. నాలుగున్నరేళ్ల తరువాత చూస్తే చిన్న స్థాయిలో తాత్కాలిక ఆఫీసు భవనాలు తప్పితే, పక్కాగా ఏమైనా వచ్చాయా?  

అది స్విస్‌ చాలెంజ్‌ కాదు 
అమరావతిలో సింగపూర్‌ టౌన్‌షిప్‌ పేరిట 1,691 ఎకరాలు కోర్‌ కేపిటల్‌ ఏరియా అభివృద్ధి అంటూ సింగపూర్‌ కంపెనీలకు ఇచ్చారు. దీని కోసం సింగపూర్‌ ప్రభుత్వం మాస్టర్‌ ప్లాన్‌ ఉచితంగా ఇస్తామని చెప్పింది. ఆపై కోర్‌ క్యాపిటల్‌ ఏరియా అభివృద్ధికి రెండు ప్రభుత్వాలు ఒప్పందం కుదుర్చుకునేందుకు ముందుకు వచ్చాయి. ఆ తర్వాత వెనక్కు తగ్గాయి. తమ కంపెనీలకు ప్రాజెక్టు ఇవ్వాలని సింగపూర్‌ ప్రభుత్వం చెప్పింది. దాన్ని స్విస్‌ చాలెంజ్‌ కింద పెట్టారు. నిజానికి సింగపూర్‌ కంపెనీలకు భూములు అప్పచెప్పడం స్విస్‌ చాలెంజ్‌ కింద రాదు. స్విస్‌ చాలెంజ్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల్లో.. ఒక కంపెనీ తనంతట తాను అభివృద్ధికి ముందుకు రావాలి అని కచ్చితంగా చెప్పింది. అయితే సింగపూర్‌ ప్రభుత్వంతో తొలి నుంచీ తెలుగుదేశం ప్రభుత్వం అంటకాగింది. మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేయించుకుంది. వాళ్ల కంపెనీలు సీఆర్‌డీఏతో సమాచారాన్ని పంచుకున్నాయి. స్విస్‌ చాలెంజ్‌ విధానమంటే ఎవ్వరైనా తమంతట తాము ప్రతిపాదన ఇవ్వాలి. ఇక్కడ సింగపూర్‌ కంపెనీలు అందుకు భిన్నంగా ప్రభుత్వ నోటిఫికేషన్‌కు అనుగుణంగా ప్రతిపాదన ఇచ్చాయి. చంద్రబాబు ఎంచుకున్న ప్రక్రియ చట్టరీత్యా, సాంకేతిక రీత్యా సరైంది కాదు. స్విస్‌ చాలెంజ్‌లో దరఖాస్తు చేసుకున్న ఇతర సంస్థలను అనర్హులుగా ప్రకటించేసి సింగిల్‌ బిడ్‌పై సింగపూర్‌ కంపెనీలకు ఇచ్చేశారు. సింగపూర్‌ కంపెనీల్లో అసెండాస్‌–సెమ్‌బ్రిడ్జి, సెమ్బ్‌కార్ప్‌ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్‌ ఉన్నాయి. సెమ్బ్‌కార్ప్‌పై ఇప్పటికే అంతర్జాతీయంగా అవినీతి ఆరోపణలున్నాయి. 

కాల్‌మనీ అందుకే పుట్టిందంటారు.. 
నూజివీడు దగ్గర రాజధాని వస్తుందేమోనని వాళ్ల వాళ్లంతా ముందే భూములు కొనుక్కున్నారు. కానీ అక్కడేదో సమస్య వచ్చింది. దీంతో లీకులు ఇచ్చి అక్కడ భూమి రేట్లు పెంచి అమ్ముకునేలా చూశారు. నూజివీడు భూముల విక్రయం వల్లే విజయవాడలో కాల్‌మనీ రాకెట్‌ పుట్టిందంటారు. ఈ కాల్‌మనీతో విజయవాడ వాళ్లు అక్కడ భూములు కొనుక్కున్నారు. తర్వాత దాన్ని డబ్బులు చేసుకుని వెలగపూడిలో కొన్నారు. ఆ ఏడాది జూన్‌ 2 నుంచి సెప్టెంబర్‌ వరకూ రకరకాల పేర్లు వినిపించారు. దానికి నేను ఫ్లోటింగ్‌ క్యాపిటల్‌ అని పేరుపెట్టాను. సెప్టెంబర్‌ 3న అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు కూడా విజయవాడ, దాని చుట్టుపక్కల అన్నారు కానీ ప్రాంతం ఏదో చెప్పలేదు. సెప్టెంబర్‌ ఆఖరున సేకరణ నియమాలను నిర్ణయించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించేంత వరకు విజయవాడ, చుట్టుపక్కల ఉన్నవారంతా రకరకాల ఊహాగానాలతో పెట్టుబడులు పెట్టి బాగా దెబ్బతిన్నారు. ఈ దెబ్బతినడానికి ప్రధాన బాధ్యత ప్రభుత్వానిదే. ప్రజలపై ప్రభుత్వం చాలా అన్యాయంగా ట్రిక్కులు ప్లే చేసింది. 

మళ్లీ కేంద్రం నిధులివ్వాలంటే నిర్మాణాలేవీ?
అక్కడ రాజధాని పెట్టడమే తప్పు అని వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా ప్రసిద్ధి చెందిన రాజేందర్‌ సింగ్‌ స్పష్టంగా చెప్పారు. రాజధాని విషయంలో కేంద్రం నిధులైతే ఇచ్చింది కానీ అక్కడ నిర్మాణాలు పూర్తిచేస్తే కదా మళ్లీ నిధులు అడిగేది. పరిస్థితి ఎలా ఉందంటే వచ్చే ఎన్నికల ఆరు నెలలు ముందు వాతావరణం తెలుసుకుని అమరావతి ప్రాంతంలో కొన్న భూములను అయినకాడికి అమ్ముకుని బయటపడాలనే ఉద్దేశంతో చాలా మంది ఉన్నారు. ఈ విషయం నాకు విజయవాడ విమానాశ్రయంలో ఒక తెలుగుదేశం నాయకుడే చెప్పారు. ప్రపంచ బ్యాంకు నుంచి రూ. 5 వేల కోట్లు తేవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఆ అంశంపై ప్రస్తుతం వారు పరిశోధన చేస్తున్నారు. ఈ మొత్తం వచ్చేది అనుమానమే. కాని ఇన్ని అవకతవకలు, అస్తవ్యస్థ పరిస్థితులు, అక్రమాలను చూసిన తరువాత కేంద్రం ప్రపంచ బ్యాంకు సహాయానికి అంగీకరిస్తుందా? జరుగుతున్న విషయాలను కేంద్రం గమనించదనుకోవడం అమాయకత్వం కాదా?  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top