దుమ్ముగూడెం టెండర్లలో భారీ కుంభకోణం

Huge scam in tenders of Dummagudem says Uttamkumar Reddy - Sakshi

కేసీఆర్, ఆయన బంధువులకు కమీషన్లు: ఉత్తమ్‌ 

పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా ధర్నాలు 

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం, దుమ్ముగూడెం ప్రాజెక్టుల నిర్మాణ టెండర్లలో భారీ కుంభకోణం జరిగిం దని  పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఇటీవల పిలిచిన రూ.50 వేల కోట్ల టెండర్లకు గాను సీఎం కేసీఆర్, ఆయన బంధువులు 8 శాతం కమీషన్‌ తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ టెండర్లను రద్దు చేసి మళ్లీ ప్రపంచ స్థాయి టెండర్లను పిలవాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పార్టీ సీనియర్‌ నాయకులతో ఆయన మాట్లాడారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస్‌ కృష్ణన్, ఎంపీ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీ ఎమ్మెల్యే లు పలువురు డీసీసీ అధ్యక్షులు, ముఖ్య నేతలు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

ఉత్తమ్‌ మాట్లాడుతూ.. ప్రపంచం మొత్తం కరోనా వైరస్‌ మీద పోరాడటంలో బిజీగా ఉంటే, కేసీఆర్, ఆయన బంధువులు మాత్రం నీటి పారుదల ప్రాజెక్టుల్లో కమీషన్లు తీసుకునే బిజీలో ఉన్నారని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో న్యాయం కోసం అన్ని చట్టపరమైన ఫోరమ్‌లను ఆశ్రయిస్తామని, ఏపీ సీఎం జగన్‌తో కేసీఆర్‌కున్న సంబంధాన్ని బహిర్గతం చేస్తామన్నారు. పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా బుధవారం దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి రంగారెడ్డి, పాలమూరు, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలోని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనున్నట్టు ఉత్తమ్‌ వెల్లడించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top