కశ్మీర్‌ కోసం ప్రాణాలైనా అర్పిస్తా: అమిత్‌ షా

Home Minister Amit Shah Speaks In Lok Sabha On Kashmir Issue - Sakshi

లోక్‌సభ బిల్లును ప్రవేశపెట్టిన అమిత్‌ షా

బిల్లుపై వాడీవేడీ చర్చ

సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌ పునర్విభజన బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మంగళవారం లోక్‌సభ ముందుకు తీసుకువచ్చారు. ఆర్టికల్‌ 370 రద్దుపై కూడా కేంద్రమంత్రి లోక్‌సభలో ప్రకటన చేశారు. చర్చలో భాగంగా కాంగ్రెస్‌ పక్షనేత అధీర్‌ రంజన్‌ చౌదరీ మాట్లాడుతూ.. కశ్మీర్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం సరైన నియమాలను పాటించలేదని విమర్శించారు. కశ్మీర్‌ మొదటి నుంచీ దేశ అంతర్గత వ్యవహారమని, కానీ ఇటీవల విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఇది ద్వైపాక్షిక అంశమని పేర్కొన్నారని ఆయన గుర్తుచేశారు. కశ్మీర్‌ అంతర్గత వ్యవహారమా? లేక ద్వైపాక్షిక వ్యవహారమా? అన్నది కేంద్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

అధీర్‌ రంజన్‌ వ్యాఖ్యలపై అమిత్‌ షా తీవ్రంగా స్పందించారు. కశ్మీరీలకు ఈ పరిస్థితికి రావడానికి కాంగ్రెస్‌ చేసిన తప్పిదాలే కారణమని మండిపడ్డారు. కశ్మీర్‌ ప్రజల విముక్తి కోసం తన ప్రాణాలైనా అర్పిస్తానని షా పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని, దానికి ఇతర దేశాల మధ్యవర్తిత్వం అవసరం లేదని స్పష్టం చేశారు. కశ్మీర్‌ భారత సమాఖ్యలో భాగమేనన్న అమిత్‌ షా.. ఆ విషయం రాజ్యాంగంలో కూడా ఉందని గుర్తుచేశారు. కశ్మీర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న పార్లమెంట్‌కు పూర్తిస్థాయి అధికారం ఉందని తెలిపారు. ఆర్టికల్‌ 370, 35ఏ రద్దుతో జమ్మూకశ్మీర్‌కు ప్రయోజనం చేకూరుతుందని, ఆర్టికల్‌ 370 రద్దు తీర్మానం, జమ్మూకశ్మీర్‌ విభజన బిల్లుల ఆమోదానికి సభలో సహకరించాలని ఆయన కోరారు. ఇప్పటికే రాజ్యసభలో ఆమోదం పొందిన విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top