కాషాయ పార్టీకే ఇండిపెండెంట్ల మద్దతు

Haryana Independents Says We Support BJP - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : హరియాణాలో తిరిగి పాలనా పగ్గాలు చేపట్టేందుకు  బీజేపీ సంసిద్ధమైంది. మేజిక్‌ ఫిగర్‌కు ఆరు సీట్లు అవసరమైన క్రమంలో పాలక బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు స్వతంత్ర ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని హర్యానా లోక్‌హిత్‌ పార్టీ చీఫ్‌, ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే గోపాల్‌ కందా చెప్పారు. బీజేపీకి బేషరుతు మద్దతు ఇచ్చేందుకు ఆరుగురు ఇండిపెండెంట్లు సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. 90 మంది సభ్యులు కలిగిన హరియాణా అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 46 మంది ఎమ్మెల్యేలు అవసరం కాగా బీజేపీ 40 మంది సభ్యులకే పరిమితమైంది.కాంగ్రెస్‌ 31 స్ధానాల్లో, జేజేపీ 10 స్ధానాలు, ఇతరులు 9 స్ధానాల్లో గెలుపొందారు. హరియాణా అసెంబ్లీలో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని 8 మంది ఇండిపెండెంట్లను ఆశ్రయించింది. బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చించేందుకు హరియాణా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్ ఢిల్లీ చేరుకున్నారు. తాము హరియాణాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు పది స్ధానాలు పొందిన జేజేపీ చీఫ్‌ దుష్యంత్‌ చౌతాలా మద్దతు కోసం కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. హరియాణాపై ఆశలు వదులుకోలేదని ఆ పార్టీ నేత, మాజీ సీఎం భూపీందర్‌ సింగ్‌ హుడా పేర్కొనడం గమనార్హం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top