
కర్నూలు, నందికొట్కూరు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అబద్ధాల కోరు అని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం మండల పరిధిలోని కొణిదేల గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మూడున్నరేళ్లలో మూడు సార్లు అంబూజా, జైన్, మెగా సీడ్ పార్క్ ప్రారంభోత్సవాలు ఆర్భాటంగా చేసిన సీఎం బాబు నేటికీ ఒక ప్రాజెక్టు నిర్మాణ పనులు కూడా మొదలు పెట్టలేదన్నారు. జిల్లాపై కపట ప్రేమ చూపించడం తప్ప ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎకరా రూ.10లక్షలు పలికే తంగెడంచ ఫారం భూములను అంబూజ, జైన్, మెగా సీడ్ పార్కుకు రూ.4.50 లక్షలకే కట్టబెట్టడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు. ప్రారంభోత్సవాల పేరుతో ప్రజాధనాన్ని వృధా చేయడం సీఎంకు అలవాటేనన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. రాజన్న రాజ్యం వస్తే అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారన్నారు. ప్రజా సంక్షేమం కోసం తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవంబర్ 2నుంచి చేపట్టే పాదయాత్రను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ గ్రామ నాయకులు భాస్కరరెడ్డి, తదితరులు ఉన్నారు.