పసుపు రైతులకు జనవరిలో శుభవార్త

Good News To Turmeric Farmers On January, says MP Arvind Dharmapuri - Sakshi

సాక్షి న్యూఢిల్లీ: పసుపు రైతులకు జనవరిలో శుభవార్త వినిపిస్తామని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ తెలిపారు. పసుపు బోర్డును మించిన ప్రయోజనాలు కల్పించే దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ‘అరవింద్‌ గట్టి నెగోషియేటర్‌ అన్న విషయం నిరూపిస్తాను. పసుపు దిగుమతి నిలిపేయాలని కోరాం. ఇందుకు కేంద్రం సానుకూలంగా ఉంది. పసుపు జాతీయ స్థాయిలో సాగు చేసే పంటకాదు. అయినా సరే పసుపు పంటకు మద్దతు ధర కల్పించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. అయితే ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు రావాలి.

ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం పసుపు మద్దతు ధరపై ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదు. తెలంగాణ రాష్ట్రానికి ప్రతిష్టాత్మక ఐఐఎం, ఐఐఎస్‌ఈఆర్‌ కేటాయించాలని హెచ్‌ఆర్డీ మంత్రిని కోరాం. అందుకు మంత్రి కూడా సానుకూలంగా స్పందించారు. పార్లమెంట్‌ సమావేశాల చివరి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశాం. తెలంగాణ బీజేపీదే అని ప్రధాని అన్నారు. తదుపరి తెలంగాణలో ఏర్పడేది బీజేపీ సర్కారే అని కేంద్ర నాయకత్వం నమ్ముతోంది. క్షేత్రస్థాయిలో సమాచారం లేకుండా మోదీ ఏదీ మాట్లాడరు. తెలంగాణలో ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారు.’ అని అన్నారు. కాగా పసుపు రైతుల కష్టాలు, మద్దతు ధరపై ఎంపీ అరవింద్‌  ఇవాళ కేంద్రమంత్రులు అమిత్‌ షా, పియూష్‌ గోయల్‌ను కలిశారు. విదేశాల నుంచి పసుపు దిగుమతి నిలిపివేయాలని రైతులను ఆదుకోవాలని ఆయన ఈ సందర్భంగా కేంద్రమంత్రులను కోరారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top