అమెరికా నుంచి జర్నలిస్టులకు పరీకర్‌ ఫోన్‌

Goa CM Manohar Parrikar Call To Journalists - Sakshi

పనాజీ: అనారోగ్యం కారణంగా గత నాలుగు నెలలుగా అమెరికాలో చికిత్స పొందుతోన్న గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పరీకర్‌ రాష్ట్ర పరిస్థితులపై ఆరాతీశారు. తనకు సన్నిహితంగా ఉన్న జర్నలిస్టులకు ఫోన్‌ చేసి రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి చర్చించారు. కాగా గత కొద్దికాలంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో పరీకర్‌ విలేకరులతో మాట్లాడి రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థిల గురించి అడిగి తెలుసుకున్నారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని కొద్ది రోజుల్లో రాష్ట్రానికి తిరిగి రానున్నట్లు ముఖ్య మంత్రి పేర్కొన్నారు. సీఎంతో ఫోన్‌లో మాట్లాడిన ఓ సీనియర్‌ జర్నలిస్టు మీడియాతో మాట్లాడుతూ... కొద్దిరోజుల్లో గోవాకు వస్తున్నట్లు పరీకర్‌ చెప్పారన్నారు.

‘ప్రతిరోజు అధికారులతో  వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నాను. ప్రొటోకాల్‌ ప్రకారం విధులు నిర్వర్తిస్తున్నాం. ప్రభుత్వ ఫైళ్లు స్కాన్‌ చేసి నాకు మెయిల్‌ చేస్తున్నారు. టెక్నాలజీ యంత్రాల ద్వారా ప్రతీది ఇక్కడే నుంచే తెలుసుకుంటున్నాను. డాక్టర్స్‌ని సంప్రదించి కొద్ది రోజుల్లో రాష్ట్రానికి తిరిగి వస్తా’ అని ముఖ్యమంత్రి  చెప్పినట్లు పేర్కొన్నారు.

కాగా, గతవారం ముఖ్యమంత్రి ఖాతాలోని డబ్బును దుర్వినియోగం చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పాలన కుంటుపడింది. రాష్ట్రానికి మరో ముఖ్యమంత్రిని నియమించాలని డిమాండ్‌ చేశారు.

ప్రాంకియాటైటిస్‌తో బాధపడుతున్న పరీకర్‌ మార్చి 7 నుంచి అమెరికాలో చికిత్స పొందుతున్నారు. అప్పటి నుంచి రాష్ట్ర పరిపాలన వ్యవహారాలను ముగ్గురు మంత్రుల బృందం పర్యవేక్షిస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top