‘ఈ శతాబ్దపు అతి పెద్ద స్కాం’

Ghulam Nabi Azad Fire On Modi Over Rafale Deal - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్డీఏ ప్రభుత్వం ఫ్రాన్స్‌తో చేసుకున్న రాఫెల్‌ ఒప్పందం 21వ శతాబ్దపు అతి పెద్ద కుంభకోణమని కాంగ్రెస్‌ జాతీయ నాయకుడు, రాజ్యసభ ప్రతిపక్షనేత గులాంనబీ ఆజాద్‌ ఆరోపించారు. బుధవారం గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్‌లో చర్చించకుండా, కనీసం రక్షణ శాఖ మంత్రికి కూడా తెలియకుండా తన ఇష్టానుసారంగా రాఫెల్‌ డీల్‌ చేశారని ఆరోపించారు. రాఫెల్‌ డీల్‌ గురించి అజాద్‌ చెప్పిన పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే..

నోరు మెదపని ప్రధాని
‘దేశంలో ఏ ప్రభుత్వమైనా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. కానీ కేంద్రప్రభుత్వాన్ని అనేక సార్లు ప్రశ్నిస్తున్నా రాఫెల్ పై సమాదానం లేదు. లోక్‌సభ, రాజ్యసభలో ఎక్కడైనా నో అన్సర్.  గతంలో ఏ ప్రధానియైనా ఆరోపణలు వస్తే వాటిపై స్పందించారు.  కానీ తొలిసారి ఈ ప్రధాని మాత్రం నోరు మెదపటం లేదు. హైదరబాద్ నా రెండవ ఇళ్లు. అందుకే ఇక్కడ మీడియాతో రాఫెల్‌ ఒప్పందం గురించి పూర్తి వివరాలు వివరిస్తున్నా. చైనా బలపడుతోంది, పాకిస్తాన్ మరింత వైరుధ్యం పెంచుకొంటోంది. ఈ రెండు ప్రమాదమే అందుకే యూపీఏ హయాంలో డిఫెన్స్ కౌన్సిల్ ఆయుదాలకొనుగోలు చేయాలని తెలిపింది. అందులో 126 యుద్ద విమానాల అవసరం అని తెలపగా టెండర్లకు 6 కంపెనీలు పాల్గొన్నాయి. 8 రెడీ గా ఉన్నవి, 108 మన దేశంలో తయారుచేసేలా ఫ్రెంచ్ కంపెనీతో ఒప్పందం జరిగింది.

మేము ఒక్కో విమానానికి 523 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే..
108 యుద్ద విమానాలు  మన దేశంలో తయారు చేసేలా హిందుస్తాన్ ఏరో నాట్స్, ఫ్రెంచ్ కంపెనీల మధ్య ఒప్పందం కూడా జరిగి పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఏప్రిల్ 2015 లో మోదీ ఫ్రాన్స్ వెళ్లారు. అక్కడ మీడియాతో విమానాల కొనుగోళ్లపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. అయితే తర్వాత తేలిందేంటంటే పాత అగ్రీమెంట్ రద్దు చేసి కొత్త ఒప్పందం చేసుకున్నట్లు తేలింది.  అది డిఫెన్స్ మంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి ఇతరులెవరికీ తెలియదు. కేవలం మన ప్రధాని ఫ్రాన్స్ ప్రభుత్వానికి తప్ప ఎవరికి తెలియదు. మేం 523 కోట్లకు చేసిన డీల్ సేమ్ అదే విమానానికి 1670 కోట్లతో ఒప్పందం చేసుకున్నారు. హిందుస్తాన్ ఏయిర్ క్రాఫ్ట్ తో ఉన్న అగ్రిమెంట్ సైతం రద్దు చేసి మరో ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారు.

యూపీఏ హయాంలో లక్ష రూపాయలు అవినీతి జరిగినా పెద్ద అంశమే..
డిఫెన్స్ కౌన్సిల్ నిర్ణయించిన 127 విమానాల కొనుగోలును అప్పుటి మన్మోహన్ ప్రభుత్వం అంగీకరిస్తే.. ఎవరినీ సంప్రదించకుండా మోడీ ఎలా వాటిని 36 చాలు అని నిర్ణయిస్తారు. కేబినెట్ నిర్ణయం తీసుకోలేదు.. కనీసం ప్రకటించేంత వరకు దానిపై ప్రధాని సంతకం కూడా జరగలేదు. 36 యుద్దవిమానాలకు అధనంగా 41 వేల కోట్లు చెల్లించారు. 21 వ శతాబ్దంలో ఇది అత్యంత పెద్ద స్కాం. 4060 పైగా విమానాలు తయారు చేసిన ప్రభుత్వ సంస్థను కాదని, హెచ్‌ఈఎల్‌ కంపెనీని కాదని కనీసం రిజిస్ట్రేషన్ కూడా జరగని ప్రైవేట్‌ కంపెనీకి ఇచ్చారు. టెండర్ దక్కిన తర్వాతే ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ జరిగింది. యూపీఏ హయాంలో లక్ష రూపాయాల అవినీతి చాలా పెద్ద అంశం.. అదే ఎన్డీఏ ప్రభుత్వంలో 25 వేల కోట్ల పై కూడా లెక్క లేకుండా పోయింది. వాళ్ల పొట్టలు పెద్దవి అందుకే బాగా తింటున్నారు’అంటూ నరేంద్ర మోదీ నియంతృత్వ ధోరణిపై ఆజాద్‌ నిప్పులు చెరిగారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top