దొరల రాజ్యంగా మార్చారు..

Gaddar Slams On KCR Khammam - Sakshi

సాక్షి, చింతకాని: ఎందరో పోరాడి, ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణను దొరల రాజ్యంగా మార్చారని ప్రజా గాయకుడు గద్దర్‌ విమర్శించారు. చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన ఆత్మగౌరవ యాత్రలో భాగంగా శుక్రవారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభలో గద్దర్‌ పాల్గొని ప్రసంగించారు. మన నీళ్లు, మన నిధులు మనకే దక్కాలని ఎంతో మంది రాష్ట్ర సాధన కోసం అమరులు అయ్యారని, వారిని స్మరించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. నాలుగున్నరేళ్లు దొరల రాజ్యాన్ని తలíపిస్తూ రాష్ట్రంలో పాలన సాగిందని, తెలంగాణ ప్రజల కలలను దూరం చేసి.. వారి బతుకులను నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మాయ మాటలతో ప్రజల్ని మోసం చేస్తూ.. మరోమారు అధికారాన్ని చేజిక్కించుకుని దొరల పాలన సాగించాలని చూస్తున్న దొరల రాజ్యాన్ని కూల్చేయాలన్నారు. ఈ సందర్భంగా సభకు హాజరైన ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు.

అనంతరం టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మధిర తాజా మాజీ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని మోదీ, కేసీఆర్‌ నాశనం చేయాలని చూస్తున్నారని, భారత రాజ్యాంగం ఈరోజు అనేక ఒడిదుడుకులకు లోనవుతుందన్నారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకుని సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణ దొరల గడీల్లో నలిగిపోతుందన్నారు. 70, 80 ఏళ్ల క్రితం ఉన్న దొరల విష సంస్కృతి.. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతోందన్నారు. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల ప్రభుత్వాన్ని తీసుకురావాలని తెలిపారు. వచ్చే ఎన్నికలు ప్రజలకు, దొరలకు మధ్య జరిగే పోరాటం లాంటివని, ప్రజల ప్రభుత్వాన్ని తీసుకొచ్చేందుకు చేయిచేయి కలిపాలన్నారు.

ప్రజల ప్రభుత్వం కావాలో.. దొరల ప్రభుత్వం కావాలో ప్రజలు ఆలోచన చేయాలని సూచించారు. ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ గౌడ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పాలన ద్వారా పేద ప్రజలకు ఎటువంటి ప్రయోజనం కలగలేదని, పదవుల కోసం కన్న కొడుకు పేరునే తారక రామారావుగా మార్చిన కేసీఆర్‌ ఎంతకైనా దిగజారుతాడన్నారు. రావుల కాలంలో ఏమీ రాలేదని, అన్ని కులాలను నాశనం చేసిన దుర్మార్గుడి పాలనను రాష్ట్రంలో అంతమొందించాలన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. సభలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకులు సోమ్లానాయక్, మల్లు నందిని, మండల అధ్యక్షుడు అంబటి వెంకటేశ్వర్లు, నాయకులు కూరపాటి కిషోర్, కన్నెబోయిన గోపి, బందెల నాగార్జున్, మడుపల్లి భాస్కర్, పాము ఏసు, మరియమ్మ, అంబటి ఆనందరావు, ఆలస్యం వెంకటేశ్వర్లు, సిలివేరు సైదులు, కంభం వీరభద్రం, నారగాని వీరభాయి, జెడ్పీటీసీ సభ్యురాలు కూరపాటి తిరీషా తదితరులు పాల్గొన్నారు.
 
ఆటపాటలతో అలరించిన గద్దర్‌ 
సభలో ప్రజా గాయకుడు గద్దర్‌ తన ఆటపాటలతో అలరించారు. ముఖ్యంగా తెలంగాణ బతుకు చిత్రంపై ప్రదర్శించిన నాటకం విశేషంగా ఆకట్టుకుంది. ‘దగాపడ్డ నా తెలంగాణ గుండె చప్పుడు వినుడో.., పొడుస్తున్న పొద్దుమీద..., రేలారే రేలా.., డాలర్‌ అయిపోయిందిరో నా తెలంగాణ’ అంటూ ఆలపించిన గీతాలు ఆలోచింపజేశాయి. గద్దర్‌ ఆటపాటలకు ప్రజలకు జేజేలు పలికారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top