బీజేపీలోకి వివేక్‌? 

Gaddam Vivek May Join In BJP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/కరీంనగర్‌: పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్‌.. బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైంది. ఆయన్ను పార్టీలో చేర్చుకుని పెద్దపల్లి నుంచే ఎంపీగా పోటీ చేయించాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు సఫలమైనట్టు సమాచారం. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ స్వయంగా వివేక్‌తో మాట్లాడి పార్టీలోకి ఆహ్వానించగా.. పలు తర్జనభర్జనల అనంతరం కాషాయ గూటికి చేరేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో శనివారం తన అనుచరులతో సమావేశమైన వివేక్‌.. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తీరు పై విమర్శలు గుప్పించారు. నమ్మించి గొంతు కోశారని ఆరోపించారు. బానిస సంకెళ్లు తెగిపోయినట్టేనని వ్యాఖ్యానించారు. దీంతో ఆయన టీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వచ్చినట్టేనని స్పష్టమవుతోంది. బీజేపీ శనివారం విడుదల చేసిన రెండో జాబితాలో పెద్దపల్లి అభ్యర్థిగా గోదావరిఖనికి చెందిన ఎస్‌.కుమార్‌ను ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైన రాష్ట్ర బీజేపీ నేతలు హుటాహుటిన జాతీయ నాయకత్వంతో మాట్లాడి పెద్దపల్లి అభ్యర్థి ఎంపికను నిలిపి ఉంచారు. కాగా, బీజేపీ అగ్ర నేతల ఆహ్వానం మేరకే వివేక్‌ హైదరాబాద్‌ వెళ్లినట్లు చెబుతున్నారు. పార్టీలో చేరడానికి మూడు డిమాండ్లను వివేక్‌ ప్రతిపాదించగా.. రెండింటికి బీజేపీ అంగీకరించిందని సమాచారం. మొత్తమ్మీద ఆదివారం ఆయన కాషాయ కండు వా కప్పుకోవడం ఖాయమని, అనంతరం పెద్దపల్లి నుంచి బరిలోకి దిగుతారని అంటున్నారు. 

సునీతా లక్ష్మారెడ్డి కోసం ప్రయత్నాలు.. 
ఇక మెదక్‌ నుంచి మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని బరిలో దింపేందుకు బీజేపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఇంకా కొలిక్కి రాలేదు. ఆమెను పోటీకి ఒప్పించేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఆమె నుంచి ఇంకా స్పష్టమైన సమాధానం రాలేదని సమాచారం. ఈ నేపథ్యంలో మెదక్‌ లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిని ప్రకటించకుండా పెండింగ్‌లో ఉంచారు. 

నమ్మించి గొంతుకోస్తారనుకోలే.. మాజీ ఎంపీ వివేక్‌ ఆవేదన 
గోదావరిఖని: ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ పక్కన కూర్చోబెట్టుకుని ఎంపీ టికెట్‌ ఇస్తామన్నారు.. కానీ ఇలా నమ్మించి గొంతు కోస్తారనుకోలేదు’అని మాజీ ఎంపీ వివేక్‌ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని తన నివాసంలో కార్యకర్తలు, అభిమానులతో భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎంపీ టికెట్‌ ఇస్తారన్న విశ్వాసంతో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించడానికి తన శాయశక్తుల కృషి చేశానని పేర్కొన్నారు. ఇప్పుడేమో తక్కువ ఓట్లు వచ్చాయనే కారణంతో తనకు అన్యాయం చేశారని వాపోయారు. తాను ఎప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదని, ఒకవేళ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కేటీఆర్‌కు చెప్పానని తెలిపారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top