కేజ్రీకి సీఎంల సంఘీభావం

Four non-BJP CMs support Arvind Kejriwal - Sakshi

ఢిల్లీ సీఎంను కలుసుకునేందుకు అనుమతించని లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌

కేజ్రీవాల్‌ భార్య సునీతను పరామర్శించిన పశ్చిమబెంగాల్, కేరళ, ఏపీ, కర్ణాటక ముఖ్యమంత్రులు

కేంద్రం, ప్రధానిపై మండిపడ్డ మమత బెనర్జీ

సాక్షి, న్యూఢిల్లీ: లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌(ఎల్జీ) తీరుపై నిరసన తెలుపుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు నలుగురు ముఖ్యమంత్రుల నుంచి అనూహ్య మద్దతు లభించింది. ఆదివారం నాటి నీతి ఆయోగ్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారమే ఢిల్లీ చేరుకున్న పశ్చిమబెంగాల్, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులు వరుసగా మమత బెనర్జీ, పినరయి విజయన్, చంద్రబాబు నాయుడు, కుమారస్వామి.. ఢిల్లీ సీఎంకు సంఘీభావం ప్రకటించారు.

ఈ విషయంపై సత్వరమే ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాలని డిమాండ్‌ చేశారు. ఢిల్లీ ప్రభుత్వంలో విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్‌ అధికారులు తమ సమ్మెను విరమించాలని, పేదలకు ఇంటివద్దకే రేషన్‌ అందించే ప్రతిపాదనకు ఆమోదం తెలపాలనే ప్రధాన డిమాండ్లతో కేజ్రీవాల్, తన మంత్రివర్గ సహచరులతో ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ కార్యాలయంలోని సందర్శకుల గదిలో గత ఆరు రోజులుగా నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే.

నలుగురు ముఖ్యమంత్రులు వరుసగా మమత బెనర్జీ, పినరయి విజయన్, చంద్రబాబు నాయుడు, కుమారస్వామి శనివారం సాయంత్రం కేజ్రీవాల్‌ను కలిసే అవకాశం కల్పించాలంటూ ఎల్జీని కోరారు. ఆయన అనుమతించకపోవడంతో.. కేజ్రీవాల్‌ నివాసంలో ఆయన భార్య సునీతను, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం అక్కడే విలేకరుల సమావేశం నిర్వహించి, కేంద్రప్రభుత్వం, ప్రధాని మోదీ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. అంతకుముందు ఆ నలుగురు ఏపీ భవన్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ప్రధానిపై మండిపడ్డ సీఎంలు
దేశ రాజధాని అయిన ఢిల్లీ సమస్యనే పరిష్కరించలేని వారు దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలను ఎలా పరిష్కరిస్తారని ప్రధాని మోదీపై మమతా బెనర్జీ మండిపడ్డారు. ‘చంద్రబాబు, కుమారస్వామి, పినరయి విజయన్‌లతో కలిసి కేజ్రీవాల్‌ ఇంటికి వచ్చాను. రాజకీయాలను రాజకీయాలుగానే చూడాలి. విపక్ష పార్టీలకు కూడా గౌరవం ఇవ్వాలి. ఢిల్లీలో ప్రజల అవసరాలను తీర్చాల్సిన బాధ్యత ఎన్నికైన ప్రభుత్వంపై ఉంది. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఢిల్లీలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తింది. దేశ రాజధానిలో సమస్య ఇలా ఉంటే ఎలా? దేశం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగాల భవిష్యత్తు ఏమవుతుంది? ఎల్జీ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలుండాలి. అది స్వపక్షమా? విపక్షమా? అని చూడరాదు. ఒక సీఎంను ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవడానికి వీలుకానప్పుడు ఇదేం ప్రజాస్వామ్యం?’ అని తీవ్రంగా ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ‘మేం కేజ్రీవాల్‌ను కలవాలనుకున్నాం.

ఈ ప్రభుత్వం పనిచేసే పరిస్థితి కల్పించాలి. అంతిమంగా మా డిమాండ్‌ ఒక్కటే. ఈ సమస్యను పరిష్కరించాలి. ఎన్నికైన ప్రభుత్వాన్ని పనిచేసుకోనివ్వాలి. కేంద్రం–రాష్ట్రం కలిసి పనిచేయాలి. అప్పుడే ప్రజలకు సేవ చేయగలం’ అని పేర్కొన్నారు. కుమారస్వామి మాట్లాడుతూ ‘ఢిల్లీ సీఎంకు మద్దతు తెలిపేందుకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వచ్చాం. ఢిల్లీ దేశ రాజధాని. కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలి’ అని పేర్కొన్నారు. ‘కేంద్రం వైఖరి కారణంగానే ఈ పరిస్థితి తలెత్తింది. ఇది ప్రజాస్వామిక దేశం. కేంద్రం సమాఖ్య వ్యవస్థను గౌరవించాలి. కేజ్రీవాల్‌కు మా మద్దతుంటుంది’ అని  విజయన్‌ పేర్కొన్నారు.

మండిపడ్డ కేజ్రీవాల్‌
సీఎంల వినతిని ఎల్‌జీ తిరస్కరించడంపై కేజ్రీవాల్‌ మండిపడ్డారు. ‘లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సొంతగా ఈ నిర్ణయం తీసుకుంటారనుకోను. కచ్చితంగా ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఆయన ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఒక సీఎంను.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవడాన్ని ప్రధాని అడ్డుకోగలరా? రాజ్‌ నివాస్‌ ఏ ఒక్కరి సొత్తు కాదు. ఇది దేశ ప్రజలది. ఈ ఆందోళన మరింత తీవ్రతరం అవుతుంది’ అని ట్వీట్‌ చేశారు.  

శనివారం ఏం జరిగింది?
పశ్చిమబెంగాల్, కేరళ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు మొదట ఆంధ్రా భవన్‌లో సమావేశమమయ్యారు. కేజ్రీవాల్‌కు మద్దతును సమీకరించేందుకు కావాల్సిన ప్రయత్నాలపై చర్చించారు. అనంతరం రాజ్‌ నివాస్‌ (లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నివాసం, కార్యాలయం)లో నిరసన చెబుతున్న కేజ్రీవాల్‌ను కలుసుకునేందుకు అనుమతించాలని ఎల్‌జీ బైజాల్‌కు లేఖ రాశారు. కేజ్రీవాల్‌ను కలిసేందుకు అనుమతివ్వబోనని ఎల్‌జీ స్పష్టంచేశారు. తర్వాత వీరంతా కేజ్రీవాల్‌ నివాసంలో కుటుంబ సభ్యులను కలుసుకుని సంఘీభావం తెలిపారు.

అప్పుడు ఏమయ్యారు: బీజేపీ
నలుగురు సీఎంలు కేజ్రీవాల్‌కు సంఘీభావం తెలపడంపై బీజేపీ మండిపడింది. ‘కేజ్రీవాల్‌ నివాసంలో, ఆయన సమక్షంలోనే సీఎస్‌ అన్షు ప్రకాశ్‌పై దాడి జరిగింది. అప్పుడు ఈ నలుగురు ఏమయ్యారు? ఆ నాలుగు రాష్ట్రాల సీఎస్‌లు కూడా అన్షు ప్రకాశ్‌కు సంఘీభావంగా ముందుకు వస్తే వీళ్లేం చేస్తారు?’ అని బీజేపీ సీనియర్‌ నేత విజయ్‌ గోయెల్‌ ప్రశ్నించారు.   
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top