చట్టసభలకు ఐదుగురు ఏఎంసీ విద్యార్థులు | Sakshi
Sakshi News home page

చట్టసభలకు ఐదుగురు ఏఎంసీ విద్యార్థులు

Published Thu, May 30 2019 10:01 AM

Five Andhra Medical College Students Wins In AP Election 2019 - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం ఆంధ్ర మెడికల్‌ కళాశాల (ఏఎంసీ)లో వైద్య విద్యను అభ్యసించిన ఐదుగురు డాక్టర్లు ఈ సార్వత్రిక ఎన్నికల్లో చట్టసభలకు ఎన్నికయ్యారు. వీరిలో ఒకరు లోక్‌సభ, నలుగురు అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి ఎంపీగా డాక్టర్‌ భీశెట్టి వెంకట సత్యవతి విజయం సాధించారు. ఆమె ఆంధ్ర మెడికల్‌ కాలేజీలో మెడిసిన్‌ పూర్తి చేశారు. అనంతరం అనకాపల్లిలో ఆస్పత్రి ఏర్పాటు చేసి లక్షకు పైగా సాధారణ ప్రసవాలు (నార్మల్‌ డెలివరీలు) చేసిన వైద్యురాలిగా పేరు తెచ్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడకు చెందిన డాక్టర్‌ సీదిరి అప్పలరాజు ఏఎంసీలో వైద్య విద్య పూర్తి చేసుకుని పలాసలో వైద్య సేవలందిస్తున్నారు. ఈ ఎన్నికల్లో పలాస నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించారు.

ఇక గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా విశాఖ ఏంఎంసీలోనే వైద్య విద్య అభ్యసించారు. ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గం నుంచి గెలుపొందిన డాక్టర్‌ డీబీవీ స్వామి కూడా ఏఎంసీ పూర్వ విద్యార్థే. కృష్ణా జిల్లా నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన డాక్టర్‌ ఎం.జగన్‌మోహనరావు కూడా విశాఖ ఏఎంసీలోనే వైద్యవిద్య అభ్యసించారు. వీరిలో వెంకట సత్యవతి, అప్పలరాజు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జగన్‌మోహన్‌రావు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీచేసి ఎన్నికల్లో గెలుపొందగా.. డీబీవీ స్వామి తెలుగు దేశం పార్టీ నుంచి గెలుపొందారు. ఆంధ్ర మెడికల్‌ కాలేజీ విద్యార్థులు ఒకే ఎన్నికల్లో ఇంతఎక్కువ మంది చట్టసభలకు వెళ్లడం ఇదే ప్రథమమని, ఇది తమకు గర్వకారణమని ఏఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పీవీ సుధాకర్‌ ‘సాక్షి’తో చెప్పారు. వీరిని త్వరలో విశాఖలో ఘనంగా సత్కరించనున్నట్లు తెలిపారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement