
కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా
శ్రీనగర్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఇటివల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నేషనల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా స్పందించారు. ఇటివల అలీగడ్ ముస్లిం యూనివర్సిటీలో సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ చేతులకు ముస్లింల రక్తపు మరకలు’ అని చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. ఈ విషయాన్ని అన్ని రాజకీయ పార్టీల నేతలు గమనించాలని, ఇకనైన కనువిప్పు కలగాలని ఆయన కోరారు.
‘ఖుర్షీద్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నా.. ఇలాంటి పరిస్థితిని తిరిగి రానివ్వకూడదు. గతంలో చేసిన తప్పుల్ని నేతలు మళ్లీ జరగకుండా చుసుకోవాలి. రాజకీయ నాయకత్వం, రాజకీయ పక్షపాతాన్ని పక్కనపెట్టి, కశ్మీర్‌కు జరిగిన అన్యాయాన్ని, కశ్మీర్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలి. ఇంత వరకూ చేసిన తప్పుల్ని ఒప్పుకుని ప్రజలను క్షమాపణలు కోరాలి ’ అని అన్నారు. దేశంలోని ముస్లింలు నిస్వార్థంతో పనిచేస్తున్నారు. వారికి శాంతి, సామరస్యం తప్ప మరొకటి తెలియదని ఫరూక్ అన్నారు. ముస్లింల గతమంతా అన్యాయం, అసమానత్వం, దురభిప్రాయం వంటి అంశాలతోనే ముడిపడి ఉంది. ప్రస్తుతం ముస్లింలు గౌరవంగా బతుకుతున్నారని అబ్దుల్లా పేర్కొన్నారు.