గురుడి బలముండాలి.. శుక్రుడు అనుకూలించాలి 

The Election Commission Should Make Good Progress in Filing Nominations. - Sakshi

సాక్షి, అమరావతి : ‘తిథి, వార, నక్షత్రాలు కలసిరావాలి.. గురుడు బలంగా ఉండాలి.. శుక్రుడు అనుకూలించాలి.. చంద్రుడు చల్లగా చూడాలి.. చివరకు రాజయోగం సిద్ధించాలి’ ఎన్నికల్లో టిక్కెట్లు దాదాపు ఖరారైన, కచ్చితంగా టిక్కెట్టు దక్కుతుందనుకుంటున్న అభ్యర్థులు, ఆశావహుల మనోగతం ఇది. సీటు రావాలంటే అధిష్టానం కరుణించాలి. అందుకు రాజకీయ సమీకరణలు అనుకూలించాలి. ఇక గెలవాలంటే ప్రజలు ఆదరించాలి. ఓట్లేయాలి. ఈ రెండింటి మధ్యలో మరో ముఖ్య ఘట్టం ఉంది. అదే నామినేషన్ల దాఖలు. సీటు సాధించడానికి ఎంతగా ప్రయత్నిస్తారో.. నామినేషన్లు వేసేందుకు మంచి ముహూర్తానికీ అంతగా ప్రాధాన్యమిస్తారు. నామినేషన్ల దాఖలుకు ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన గడువులోనే తమకు అనుకూలించే మంచి ముహూర్తం చూసుకోవాలి.  

ఆ రోజులకే ప్రాధాన్యం
ఎన్నికల నోటిఫికేషన్‌ సోమవారం విడుదలైంది. నామినేషన్లు వేసేందుకు 25వరకు గడువు ఉంది. అంటే 7 రోజులు సమయం ఉంది. మంచి ముహూర్తంలో నామినేషన్‌ వేయాలని భావిస్తున్న వారు ఇప్పటికే పురోహితులను సంప్రదిస్తున్నారు. వారు పంచాగాలు తిరగేస్తూ అభ్యర్థులు, ఆశావహుల జన్మ నక్షత్రాలు, లగ్నాలు, జాతక చక్రాలను పరిశీలిస్తున్నారు. 19, 22, 25 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. 

ప్రాధాన్యం ఎందుకంటే.. 
ఆ మూడు రోజులకే ఎక్కవ ప్రాధాన్యం ఎందుకని పురోహితులను సంప్రదించగా వారు చెప్పిందేమిటంటే.. 19వ తేదీ నామినేషన్లకు మంచిదట. ఆ రోజు త్రయోదశి మంగళవారం, మఖ నక్షత్రం. త్రయోదశి జయ తిథి కాబట్టి జయానికి కలసి వస్తుంది. మంగళవారం కుజుడు  రోజు కావడంతో అదృష్టం కలసి వచ్చే అవకాశం ఉంది. మఖ నక్షత్రం రాజయోగానికి అనుకూలం. చాలామంది ఆ రోజు నామినేషన్లు వేయాలని భావిస్తున్నారు. 22న అన్నిటికంటే ముహూర్తం బాగుందని పురోహితులు చెబుతున్నారు.

ఆ రోజు విదియ శుక్రవారం. హస్త, చిత్త నక్షత్రాలు ఉన్నాయి. విదియ కూడా జయ తిథి కాబట్టి జయానికి దోహదపడుతుంది. శుక్రవారం శుక్రుడు బలం కలిసొస్తుంది. ఆ రోజు ఉదయం 11గంటల వరకు హస్త నక్షత్రం ఉంది. ఆ నక్షత్రానికి చంద్రుడు అధిపతి. చం ద్రుడు రాజయోగ కారకుడు. ఇక 22న ఉదయం 11గంటల నుంచి చిత్త నక్షత్రం ఉంది. ఆ నక్షత్రానికి అధిపతి కుజుడు. అత్యంత యోగకారకుడు. దాంతో ఈ నెల 22 అన్నివిధాలా మంచిదని పురోహితులు చెబుతున్నారు.

ఎవరికైనా ఆ రోజు కలిసొస్తుందని స్పష్టం చేస్తున్నారు.  ఆ రోజు అన్నిపార్టీల అగ్రనేతలతోపాటు అత్యధికులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన ఈ నెల 25న కూడా మంచి ముహూర్తం ఉంది. అభ్యర్థుల జన్మ లగ్నాలను బట్టి ఆరోజు నామినేషన్లు వేయడం కలసి వస్తుందంటున్నారు. వృషభ, మకర, తుల, కుంభ లగ్నాల్లో జన్మించిన వారికి ఆ రోజు యోగకారకమని చెబుతున్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top