నోరు మూయించిన ఈసీ

EC restrains Adityanath, Mayawati, Azam Khan, Maneka from poll campaigning - Sakshi

విద్వేషకర వ్యాఖ్యలు చేసిన యోగి, మేనక, మాయావతి, ఆజంఖాన్‌లు

3 రోజులు ప్రచారం నిర్వహించకుండా నిషేధం

సుప్రీంకోర్టు ఆగ్రహం అనంతరం చర్యలు తీసుకున్న ఈసీ

న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారంలో విద్వేష వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యోగిఆదిత్యనాథ్, బీజేపీ నేత మేనకాగాంధీ, బీఎస్పీ చీఫ్‌ మాయావతి, ఎస్పీ నేత ఆజంఖాన్‌పై ఎన్నికల సంఘం (ఈసీ) కన్నెర్రజేసింది. యోగి, మేనక, మాయ మతవిద్వేష వ్యాఖ్యలు చేయగా, బీజేపీ నేత జయప్రద వ్యక్తిత్వాన్ని అవమానించేలా ఆజంఖాన్‌ మాట్లాడారు. విద్వేష వ్యాఖ్యల అంశంలో ఈసీ తగిన చర్యలు తీసుకోలేదంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో యోగి, ఆజంఖాన్‌లు 72 గంటలపాటు (3 రోజులు), మేనక, మాయ 48 గంటలపాటు (2 రోజులు) ఏ విధమైన ప్రచారం చేయకుండా ఈసీ నిషేధించింది. విద్వేష వ్యాఖ్యలు చేసినందుకు వారికి ఈసీ చీవాట్లు పెట్టింది.

యోగి, ఆజంఖాన్‌లు గతంలోనూ ఇలాంటి మత విద్వేష వ్యాఖ్యలు చేయడంతో వారిని ఈసీ హెచ్చరించినప్పటికీ తీరు మార్చుకోకపోవడంతో వారిద్దరిపై 72 గంటల నిషేధం విధించామని ఎన్నికల సంఘం అధికారి వెల్లడించారు. అదే మాయ, మేనకలు తొలిసారి విద్వేష వ్యాఖ్యలు చేసినందున వారిపై 48 గంటల నిషేధమే విధించామన్నారు. ఈ నిషేధం మంగళవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తుందని ఈసీ అధికారి చెప్పారు. ఈ ఎన్నికలు అలీకి, బజరంగ్‌ బలికి మధ్య జరిగే యుద్ధమని మీరట్‌లో యోగి అన్నారు. ముస్లింలు కాంగ్రెస్‌కు ఓటు వేయకూడదని దేవబండ్‌లో మాయావతి కోరారు. ముస్లింలు తనకు ఓటు వేయకపోతే తర్వాత వారు ఏదైనా పనికోసం తన వద్దకు వచ్చినప్పుడు వారికి సాయం చేయాలని తనకు అనిపించదని మేనక పేర్కొన్నారు. ఇక జయప్రదకు ఆరెస్సెస్‌తో ఉన్న సంబంధాలపై ఆజంఖాన్‌ మాట్లాడుతూ జయప్రద ఖాకీ నిక్కర్‌ వేసుకుంటుందని అన్నారు. 2014 ఎన్నికల ప్రచారంలోనూ మత విద్వేష వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, ఎస్పీ నేత ఆజం ఖాన్‌లపై ఈసీ నిషేధం విధించింది.

సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలోనే..
విద్వేష వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ఈసీ ఏ చర్యలూ తీసుకోవడం లేదంటూ సుప్రీంకోర్టు బెంచ్‌ తొలుత ఆగ్రహం వ్యక్తం చేసింది. అర్ధగంటలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ తమ ముందు ఉండాలని కూడా ఓ సందర్భంలో హెచ్చరించింది.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top