విజయకాంత్‌, ప్రేమలతపై సెటైర్లు..

DMK Leaders Slams On Vijayakanth And Sumalatha - Sakshi

సాక్షి, చెన్నై: లోక్‌సభ ఎన్నికల్లో డిపాజిట్ల గల్లంతే కాదు, ఓటింగ్‌ శాతాన్ని డీఎండీకే పూర్తిగా కోల్పోయింది. వరుస పతనాల నేపథ్యంలో ఆ పార్టీ మరింత కష్టాల్లోకి కూరుకుపోయింది. ఆ పార్టీకి ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమిషన్‌ గుర్తింపు రద్దు అయినట్టే. అలాగే, ఢంకా చిహ్నం దూరం కావడం దాదాపుగా ఖాయమైంది. విజయకాంత్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగలడం ఓ వైపు ఉంటే, ఆయన సతీమణి ప్రేమలత తీరుపై డీఎండీకే వర్గాలు విమర్శలు గుప్పించే పనిలో పడడం గమనార్హం. సినీ నటుడిగా అశేషాభిమాన లోకం మదిలో ముద్ర వేసుకున్న విజయకాంత్‌ 2005లో మదురై వేదికగా డీఎండీకేను ప్రకటించారు. దేశీయ ముర్పోగు ద్రావిడ కళగంతో 2006లో ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లో విజయకాంత్‌ ఒక్కడే అసెంబ్లీ మెట్లు ఎక్కారు. అయితే, ఆ ఎన్నికల్లో విజయకాంత్‌ సొంతం చేసుకున్న ఓటు బ్యాంక్‌ ఆ పార్టీ బలాన్ని మరింతగా పెంచింది.

2009 లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన విజయకాంత్‌ 10.3 శాతం ఓటు బ్యాంక్‌ను సొంతం చేసుకున్నారు. ఆ తదుపరి పరిణామాలతో 2011 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించారు. ఇందుకు కారణం అన్నాడీఎంకేతో పొత్తుతో ఆ ఎన్నికల్ని ఎదుర్కొనడమే. ప్రధాన ప్రతి పక్ష నేతగా ఉన్నత స్థితికి ఎదిగిన వేళ అన్నాడీఎంకేతో వైరం విజయకాంత్‌ను కష్టాల సుడిగుండంలో పడేసింది. పార్టీ ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే జై కొట్టడం వంటి పరిణామాలు విజయకాంత్‌ను ఇరకాటంలో పెట్టాయి. అయినా, ఏ మాత్రం తగ్గని విజయకాంత్‌  2014 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకేకు ప్రత్యామ్నాయంగా ఎన్డీఏ నేతృత్వంలో కూటమి ఏర్పాటులో సఫలీకృతుడయ్యారు. అయితే, ఆ ఎన్నికల్లో డిపాజిట్ల గల్లంతుతో పాటు ఓటు బ్యాంక్‌ పతనం మొదలైంది. 2016 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముఖ్య నేతలు డీఎంకే, అన్నాడీఎంకేల్లోకి వెళ్లడంతో అభ్యర్థుల కోసం తీవ్ర కుస్తీలు పట్టక తప్పలేదు. చివరకు ఆ ఎన్నికల ఫలితాలు విజయకాంత్‌ను పాతాళంలోకి నెట్టే పరిస్థితిని కల్పించాయి. విజయకాంత్‌ సైతం ఓటమి పాలు కాగా, ఓటు బ్యాంక్‌ ఐదు శాతం పైగా దక్కించుకుని పార్టీ గుర్తింపు రద్దు కాకుండా గట్టెక్కారు.

గుర్తింపు రద్దయినట్లే....
2016 ఎన్నికల అనంతరం అనారోగ్య కారణాలతో విదేశాలకు వెళ్తూ వచ్చిన విజయకాంత్‌కు 2019 లోక్‌సభ ఎన్నికల్లో డిమాండ్‌ పెరిగింది. ఆయన్ను తమ వైపు అంటే, తమ వైపు తిప్పుకునేందుకు డీఎంకే, అన్నాడీఎంకేలు ప్రయత్నించాయి. చివరకు అన్నాడీఎంకే – బీజేపీతో జతకట్టిన విజయకాంత్‌ నాలుగు చోట్ల పోటీ చేశారు. అయితే, ఎన్నికల ఫలితాలు డీఎండీకేను కష్టాల కడలిలో పడేసింది. డిపాజిట్లే కాదు, ఓటు బ్యాంక్‌ పూర్తిగా పతనమైంది. విజయకాంత్‌ బావ మరిది సుదీష్‌ కళ్లకురిచ్చి నుంచి పోటీ చేయగా, 3 లక్ష 21 వేల 794 ఓట్లు దక్కించుకున్నారు. విరుదునగర్‌లో ఆ పార్టీ నేత అళగర్‌ స్వామి 3 లక్షల 16 వేల 329 ఓట్లు రాబట్టుకోగలిగారు.

ఇక, ఉత్తర చెన్నైలో మోహన్‌ రాజు లక్షా 29 వేల 468, తిరుచ్చిలో ఇలంగోవన్‌ లక్షా 61 వేల 999 ఓట్లతో సరిపెట్టుకున్నారు.  పార్టీ ఓటు బ్యాంక్‌ అన్నది 2.19 శాతానికి దిగ జారింది. దీంతో ఆ పార్టీకి ఎన్నికల కమిషన్‌ గుర్తింపు రద్దు అయినట్టే అన్న పరిస్థితి. డిపాజిట్లతో పాటు ఓటు బ్యాంక్‌ తగ్గిన దృష్ట్యా, ఆ పార్టీ ఎన్నికల చిహ్నం ఢంకా కూడా దూరమైనట్టే. ఎన్నికల కమిషన్‌ గుర్తింపు ఓ పార్టీకి తప్పనిసరిగా ఉండాలంటే, కనీసం ఆరు శాతం మేరకు ఓటు బ్యాంక్‌ను కల్గి ఉండాల్సి ఉంది. అలాగే, ఒక ఎంపీ లేదా, కనీస సంఖ్యలో ఎమ్మెల్యేలైనా ఎన్నిక కావాల్సి ఉంది. అయితే, డీఎండీకేకు వరసుగా మూడు ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతు కావడంతో ఆ పార్టీ గుర్తింపు ఇక రద్దయినట్టే. అలాగే, ఢంకా చిహ్నం కూడా ఆ పార్టీకి శాశ్వతంగా దూరం ఖావడం తథ్యం.

కాగా, పార్టీ ఓటమికి కోశాధికారి ప్రేమలత విజయకాంత్‌ కారణం అంటూ ఆ పార్టీ వర్గాలే విమర్శలు గుప్పించే పనిలో పడ్డారు. ఇందుకు తగ్గట్టుగా, సామాజిక మాధ్యమాల్లో ప్రేమలత విజయకాంత్‌పై సెటైర్లు జోరందుకోవడం గమనార్హం. డీఎంకే తలుపులు తెరచి ఉన్నప్పుడే లోనికి వెళ్లకుండా, అన్నాడీఎంకే వైపుగా వెళ్లి వదినమ్మ పెద్ద తప్పే చేశారని, ఇప్పడు అన్నయ్యకు మరింత కష్టాలు తెచ్చి పెట్టారన్నట్టుగా వ్యాఖ్యల తూటాలు సామాజిక మాధ్యమాల్లో పేలుతున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top