
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకు ఏమాత్రం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. జీవితమంతా ప్రజాస్వామ్య విలువలను కాలరాసి, వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ వచ్చిన ఘనత చంద్రబాబుదన్నారు. కర్ణాటక పరిణామాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ దాన్ని ఆదర్శంగా తీసుకుని ఆ రాష్ట్ర గవర్నర్ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేలా వ్యవహరించాలని చంద్రబాబు కోరడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ధర్మాన ధ్వజమెత్తారు. చంద్రబాబు ట్వీట్, పలుచోట్ల ఆయన చేసిన వ్యాఖ్యలపై ధర్మాన శుక్రవారం రాత్రి స్పందించారు.
కర్ణాటక పరిణామాలతో దేశంలో ప్రజాస్వామ్యం పతనమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్న చంద్రబాబుకు ఆంధ్ర రాష్ట్రంలో 23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల్ని తన పార్టీలో చేర్చుకున్నప్పుడు ప్రజాస్వామ్యం గుర్తురాలేదా? అని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ గుర్తుపై గెలిచిన నలుగురిని ఏకంగా మంత్రివర్గంలోకి తీసుకోవడం ప్రజాస్వామ్యానికి విఘాతం కాదా? అని నిలదీశారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, ఒక్కొక్కరికి రూ.40 కోట్లకుపైగా ముట్టజెప్పి సంతలో పశువుల్లా కొనుగోలు చేసి బాబు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారన్నారు.
ప్రజాస్వామ్యాన్ని కాలరాసి సీఎం అయ్యావు
40 ఏళ్లు నిప్పులాంటి రాజకీయాలు చేశానని చెప్పుకునే చంద్రబాబు రాజకీయ ఎదుగుదలంతా అనైతిక వ్యవహారాలతోనే నడిచిందని ధర్మాన దుయ్యబట్టారు. అసలు చంద్రబాబు సీఎం అయ్యిందే ప్రజాస్వామ్యాన్ని కాలరాచి అని, గవర్నర్, స్పీకర్ వ్యవస్థల్ని అడ్డుపెట్టుకుని ఎన్టీఆర్ నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారని విమర్శించారు. 1995లో సొంతమామైన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యేలను వైశ్రాయ్ హోటల్‌లో దాచి సీఎం పీఠాన్ని లాక్కుని ఆయన్ను మానసిక క్షోభకు గురి చేశారన్నారు. ఆ సమయంలో గవర్నర్, స్పీకర్‌లను అప్రజాస్వామికంగా తనకు అనుకూలంగా ఉపయోగించుకుని సీఎం పీఠం ఎక్కారన్నారు. బాబు రాజకీయ పునాదే ప్రజాస్వామ్య విరుద్ధమని, ఆయన ప్రతి అడుగూ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వేసిందేనన్నారు.
దేశంలోనే అప్రజాస్వామిక నేత బాబు
కోర్టుల్లో తనమీద ఉన్న అవినీతి కేసులపై విచారణ జరక్కుండా స్టేలు తెచ్చుకున్న ఘనత కూడా చంద్రబాబుదేనని ధర్మాన అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన వ్యక్తుల్లో చంద్రబాబుదే అగ్రస్థానమని, ప్రజాస్వామ్య విలువల గురించి ఆయన వల్లె వేయడం దారుణమన్నారు. గోవా, మేఘాలయ రాష్ట్రాల్లో ఈ పరిస్థితులు ఏర్పడినప్పుడు బాబు ఎందుకు స్పందించలేదని నిలదీశారు.