‘పవర్‌’ గేమ్‌

Delhi Assembly Elections Focusing On Electricity Problem - Sakshi

విద్యుత్‌ రాయితీ చుట్టూ ఢిల్లీ రాజకీయం

2002.. విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ ప్రైవేటీకరించడానికి ముందు దశ. అప్పట్లో రాజధాని ఢిల్లీ అంటే పవర్‌కట్‌లకు కేరాఫ్‌ అడ్రస్‌.. అప్పట్లో అదే ఎన్నికల అంశం..ఆ తర్వాత కరెంట్‌ కష్టాలు తీరిపోయినా, విద్యుత్‌ బిల్లులు భారీగా పెరిగి వినియోగదారులకు షాకిచ్చాయి. అప్పుడు కూడా ఎన్నికల అంశం పవరే... అరవింద్‌ కేజ్రీవాల్‌ సీఎం అయ్యాక విద్యుత్‌ బిల్లుల్లో భారీగా సబ్సిడీలు ఇస్తున్నారు. అయినా ఈసారీ పవరే ఎన్నికల అంశం..ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పవర్‌ చుట్టూ పవర్‌ఫుల్‌గా రాజకీయాలు నడుస్తున్నాయి.

న్యూఢిల్లీ: 2013 ఎన్నికల్లో ఆనాటి షీలాదీక్షిత్‌ ప్రభుత్వంపై అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ చేసిన పవర్‌ సత్యాగ్రహ అందరి దృష్టిని ఆకర్షించింది. విద్యుత్‌ బిల్లుల భారం భరించలేమంటూ ఆప్‌ ఇచ్చిన పిలుపు మేరకు వేలాది మంది మధ్యతరగతి ప్రజలు బిల్లులు కట్టడానికి నిరాకరించారు. ఆ ఎన్నికల్లో కరెంటే కేజ్రీవాల్‌కు గణనీయమైన సంఖ్యలో సీట్లు ఇచ్చింది. 2015 ఎన్నికల్లో ‘‘బిజిలి హాఫ్, పానీ మాఫ్‌’’అన్న కేజ్రీవాల్‌ హామీతో ఓట్ల సునామీ వెల్లువెత్తింది. మొత్తం 70 స్థానాల్లో 67 సాధించిన ఆప్‌ విపక్షాలకు గట్టి షాక్‌ వచ్చింది.

ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న కేజ్రివాల్‌ 400 యూనిట్ల వరకు వాడే విద్యుత్‌ వినియోగదారుల బిల్లుల్లో 50శాతం సబ్సిడీ ఇచ్చారు. 2020 ఎన్నికలకు ఆరు నెలల ముందు సీఎం కేజ్రివాల్‌ మళ్లీ పవర్‌ గేమ్‌నే అస్త్రంగా చేసుకున్నారు. పవర్‌ రాయితీలు మరింత మందికి లబ్ధి చేకూరేలా సవరించారు. 200 యూనిట్ల వరకు ఖర్చు చేసినవారికి, లేదంటే నెలకి 800 రూపాయలు బిల్లు వచ్చిన వారికి పూర్తి మాఫీ చేస్తామన్నారు. 201–400 యూనిట్లు ఖర్చు చేసేవారికి బిల్లులో రూ.800 డిస్కౌంట్‌ ఇస్తామని ప్రకటించారు.

రాయితీ చుట్టూ రాజకీయం 
విద్యుత్‌ బిల్లులపై కొత్త రాయితీలను ఆప్‌ సర్కార్‌ ప్రకటించిన వెంటనే పవర్‌ పాలిటిక్స్‌ మొదలయ్యాయి. ఉచితాలు ఎక్కువకాలం ఇవ్వలేరని మార్చి నాటికే ఆప్‌ ప్లేటు ఫిరాయిస్తుందని బీజేపీ నాయకులు ధ్వజమెత్తారు. బీజేపీ ప్రచారానికి కౌంటర్‌గా కేజ్రీవాల్‌ తన గ్యారంటీ కార్డుల్లో విద్యుత్‌ బిల్లుల మాఫీని కూడా చేర్చారు. అయిదేళ్ల పాటు సబ్సిడీకి ఢోకా ఉండదన్నారు. దీంతో కాంగ్రెస్‌ మరో అడుగు ముందుకు వేసి 401–600 యూనిట్లు వాడే వారికి సబ్సిడీలిస్తామంటూ హామీలు ఇచ్చింది.

ఈ పరిణామాలతోబీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు మనోజ్‌ తివారీ ఆప్‌ ఇచ్చిన సబ్సిడీలకు అయిదు రెట్లు ఎక్కువే ఇస్తామంటూ ప్రకటనలు చేశారు. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం విద్యుత్‌ బిల్లుల్లో 30 శాతం కంటే ఎక్కువ రాయితీ ఇవ్వలేమని తేల్చేసింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తోందంటూ కేంద్ర మంత్రి, ఢిల్లీ ఎన్నికల ప్రచార సారథి ప్రకాశ్‌ జవదేకర్‌ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం మరోలా ఉంది. బాగా అభివృద్ధి చెందిన ఢిల్లీ ప్రజలకి ఇప్పుడు కావల్సింది సుపరిపాలన. దానికి తోడు ఇలాంటి రాయితీలు తోడైతే ఆప్‌ దూకుడుకి కళ్లెం వేయడం ఎవరి తరమూ కాదని సెంటర్‌ ఫర్‌ ది స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్‌ (సీఎస్‌డీఎస్‌) విశ్లేషకుడు సంజయ్‌ కుమార్‌ అభిప్రాయపడుతున్నారు. 

►ఢిల్లీలో గృహ విద్యుత్‌ వినియోగదారులు: 52.27 లక్షలు 
►విద్యుత్‌ సబ్సిడీతో లబ్ధి పొందిన గృహాలు: 42 లక్షలు  
►గృహ వినియోగదారుల శాతం: 80% 
►కొత్త రాయితీలతో లబ్ధి పొందేవారు: 90% 
►ప్రభుత్వ ఖజానాపై భారం: ఏడాదికి రూ. 2,250 కోట్లు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top