కాంగ్రెస్‌ ఉన్న కూటమిలో చేరం!

టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లకు మద్దతిచ్చేందుకు సీపీఎం సుముఖం

అంశాలవారీగానే అడుగులు

సాక్షి, హైదరాబాద్‌: మహాకూటమిలో అధికారికంగా చేరేందుకు ససేమిరా అంటున్న సీపీఎం అంశాల వారీ మద్దతుతో ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. కాంగ్రెస్‌ పార్టీ ఉన్న కూటమిలో తాము చేరే ప్రసక్తే లేదని, ఆ పార్టీతో ప్రత్యక్షంగా జట్టుకట్టే పరిస్థితి లేదని ఆ పార్టీ నేతలు కుండబద్దలు కొడుతున్నారు. సీపీఐ లాంటి వామపక్ష పార్టీలు, టీజేఎస్‌ లాంటి భావసారూప్య పార్టీలతోపాటు జనసేన, టీడీపీలతో కలసి పనిచేసే అవకాశాలున్నాయని వారం టున్నారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశాల్లో రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించిన కామ్రేడ్లు నేటితో ముగియనున్న రాష్ట్ర కమిటీ సమావేశాల్లో తుది నిర్ణయం తీసుకోనున్నారు.

పరస్పర సహకారం
కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాకూటమిలోకి రావాల ని సీపీఎంను అన్ని పార్టీలు కోరుతున్నాయి. అయితే, తాము జాతీయ స్థాయిలో తీసుకున్న రాజకీయ తీర్మానాన్ని ఉల్లంఘించలేమని, సామాజిక కోణంలో ‘లాల్‌– నీల్‌’ ఎజెండాతోనే ఎన్నికలను ఎదుర్కొం టామని ఆ పార్టీ అంటోంది. అందులో భాగంగానే సీపీఎంతో పాటు బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌) పక్షాన అభ్యర్థులను నిలబెట్టాలని, జనసేనతో పొత్తు కుదుర్చుకోవాలని తొలుత ఆ పార్టీ నేతలు భావించారు. సీపీఐ లాంటి వామపక్ష పార్టీల అభ్యర్థులున్నచోట్ల వారికి మద్దతివ్వాలని, టీజేఎస్‌తో కూడా కలసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు.

టీడీపీతో కూడా తమకు పెద్దగా అభ్యంతరం ఉండదని వారు చెపుతున్న నేపథ్యంలో ఆయా పార్టీలు పోటీ చేసే స్థానాల్లో సీపీఎం పక్షాన అభ్యర్థులను నిలబెట్టే అవకాశం ఉండకపోవచ్చని తెలుస్తోంది. మొత్తం మీద సీపీఎం, బీఎల్‌ఎఫ్, జనసేన పార్టీలతో కలసి కూటమిగా ముందుకెళ్లాలని, సీపీఐ, టీజేఎస్, టీడీపీ అభ్యర్థులున్న చోట్ల (కాంగ్రెస్‌ కూటమి అయినప్పటికీ) వారికి మద్దతివ్వాలని సీపీఎం కార్యదర్శివర్గ సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

అయితే, కాంగ్రెస్‌ కూటమి పక్షాన ఒకే అభ్యర్థి ఉండి, సీపీఎం, బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థులు లేని చోట్ల కూడా పరిస్థితులను బట్టి ఆలోచించాలని, మహాకూటమి అభ్యర్థిని బట్టి అవసరమైతే పరోక్షంగా మద్దతివ్వాలనే చర్చ కూడా పార్టీలో జరిగిందని సమాచారం. ఆది, సోమవారాల్లో జరిగే పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో వచ్చే అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఈ విషయంలో నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. సీపీఎం పోటీచేసే స్థానాల్లో కూడా మద్దతు కోసం ఇతర పార్టీలతో చర్చించాలనే దానిపై కూడా ఈ సమావేశాల్లోనే నిర్ణయం తీసుకోనున్నారు. రానున్న ఎన్నికలలో సీపీఎం పరంగా ఎంచుకునే విధానాన్ని ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా వెల్లడించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top