టీడీపీ పాలన కుంభకోణాలమయం

cpm p.madhu fired on cm chandra babu - Sakshi

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు  

ఒంగోలు టౌన్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్రం కుంభకోణాల్లో కూరుకుపోయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. స్థానిక సుందరయ్య భవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన మూడున్నరేళ్ల కాలంలో రాష్ట్రంలో ఉపాధి హామీలో కుంభకోణం, బియ్యంలో కుంభకోణం, ఇసుకలో కుంభకోణం, చివరకు కార్పొరేట్‌ కాలేజీల్లో కుంభకోణం ఇలా వరుసగా ప్రతిదానిలో కుంభకోణాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఉచితంగా లభించే ఇసుకను కూడా అధికారపార్టీ నేతలు వదిలిపెట్టడం లేదన్నారు.  రేషన్‌ బియ్యాన్ని  పెద్దఎత్తున పక్కదారి పట్టిస్తున్నారన్నారు.  ఉపాధి హామీ పథకంలో కూలీలకు డబ్బులు చెల్లించకుండా వారి కడుపులు కొడుతోందన్నారు. రాష్ట్రంలో ఉపాధి హామీ కింద రూ.1600కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఒక్క విశాఖ జిల్లాలో రూ.406 కోట్ల పనులు చేస్తే కేవలం రూ.75 కోట్లు మాత్రమే చెల్లించారన్నారు. విశాఖ జిల్లాలో పెద్దఎత్తున అవినీతి జరిగిందన్నారు.

రేవంత్‌రెడ్డి వాఖ్యలపై సీఎం నోరుమెదపరే..
‘రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడికి తెలంగాణ ప్రభుత్వం రూ.2వేల కోట్ల లబ్ధిచేకూర్చే కాంట్రాక్టు ఇచ్చింది. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖామంత్రి పరిటాల సునీత కుమారుడికి, అధికారపార్టీకి చెందిన మరో నాయకుడు పయ్యావుల కేశవులు అల్లుడుకు తెలంగాణ ప్రభుత్వం మద్యం, పరిశ్రమలకు సంబంధించిన లైసెన్స్‌లు ఇచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం టీఆర్‌ఎస్‌తో అంటకాగుతోంది’ అని సాక్షాత్తు తెలుగుదేశం పార్టీకి చెందిన రేవంత్‌రెడ్డి ఘాటైన వ్యాఖ్యలుచేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నోరు మెదపడం లేదన్నారు

రిలయన్స్‌కు రూ. 3వేల కోట్ల బిజినెస్‌
రాష్ట్రంలోని రేషన్‌షాపులను రిలయన్స్‌ కంపెనీకి కట్టబెట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమైందని మధు గుర్తుచేశారు. 26 వేల రేషన్‌దుకాణాలను రిలయన్స్‌ విలేజ్‌ మాల్స్‌ పేరుతో ఆ కంపెనీకి అప్పగించి ఏటా రూ.3వేల కోట్ల బిజినెస్‌ ఇచ్చేందుకు సిద్ధమైందన్నారు. రేషన్‌ దుకాణాలను రిలయన్స్‌కు అప్పగిస్తే ప్రజాపంపిణీ వ్యవస్థ కుప్పకూలుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.  పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీల వల్ల ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న చిన్న వ్యాపారుల పరిస్థితి రిలయన్స్‌ విలేజ్‌ మాల్స్‌ రాకతో కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ నవంబర్‌ 1 నుంచి 10వ తేదీ వరకు అన్ని రేషన్‌ షాపుల వద్ద ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

జిల్లా వాటా 70టీఎంసీలు రావాలి – పూనాటి
జిల్లాకు 70 టీఎంసీల వాటా నీరు రావాల్సి ఉన్నా ప్రభుత్వం విడుదల చేయడం లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు విమర్శించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల్లో నీరు పుష్కలంగా ఉన్నా..జిల్లాకు మాత్రం సరిగా ఇవ్వడం లేదన్నారు. సాగర్‌ జలాలపై ఆధారపడి జిల్లాలో 4 లక్షల ఎకరాల వరికి అవకాశం ఉందని, ప్రభుత్వం అందుకు అనుగుణంగా నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. నవంబర్‌ 6వ తేదీ లోగా ప్రకటన చేయకుంటే అదేరోజు కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహిస్తామన్నారు. జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా డెంగీ వల్ల 400 నుంచి  500 మంది చనిపోయారన్నారు. డెంగీ మరణాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.  సీపీఎం రాష్ట్ర నాయకుడు జాలా అంజయ్య పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top