లాక్‌డౌన్‌ ఉండగా మద్యం అమ్మకాలా?

CPI Demands Ban Of Liquor Sales Amid Lockdown - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కొనసాగుతుండగా మద్యం అమ్మకాలకు కేంద్రం అనుమతి ఇవ్వడాన్ని సీపీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. మద్యం అమ్మకాల పునరుద్ధరణను ప్రజావ్యతిరేక చర్యగా పేర్కొంది. లాక్‌డౌన్‌ ఎత్తివేసే వరకు దేశంలో మద్యం అమ్మకాలను నిషేధించాలని కేంద్ర  ప్రభుత్వాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి  కె. నారాయణ డిమాండ్‌ చేశారు. ఆయన మీడియాలో మాట్లాడుతూ.. ‘కరోనావైరస్ ఇప్పటికీ ఉనికిలో ఉంది. లాక్‌డౌన్‌ ఇప్పటికీ అమలులో ఉండగా మద్యం దుకాణాలను మద్యం విక్రయించడానికి ఎలా అనుమతిస్తారు? మద్యం అమ్మకాలను అనుమతించడం ప్రజా వ్యతిరేక విధానం. లాక్‌డౌన్‌ ఎత్తివేసే వరకు దేశంలో మద్యం అమ్మకాలను నిషేధించాలి. లేకపోతే ఇది ప్రజలపై చెడు ప్రభావాన్ని చూపుతుంద’ని నారాయణ అన్నారు. కాగా, పలు రాష్ట్రాల్లో సోమవారం నుంచి మద్యం అమ్మకాలు తిరిగి ప్రారంభం కావడంతో వైన్‌ షాపుల ముందు మందుబాబులు పెద్ద ఎత్తున బారులు తీరారు. దీంతో పలు పలు రాష్ట్రాలు మద్యం ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ నేపథ్యంలో వలస, అసంఘటిత కార్మికులు, పేదలు, కూలీలను కేంద్రం ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ నాయకులు దేశవ్యాప్తంగా సోమవారం ఒకరోజు దీక్షను చేపట్టారు. లాక్‌డౌన్‌ బాధితులను ఆదుకునేందుకు రూ. 10 లక్షల కోట్ల విలువైన ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించి, వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలకు విడుదల చేయాలని వారు డిమాండ్‌ చేశారు. (లాక్‌డౌన్‌ బాధిత వర్గాలను ఆదుకోండి)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top