వైఎస్సార్‌ సీపీ ర్యాలీ అనుమతుల్లోనూ కుట్ర | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ ర్యాలీ అనుమతుల్లోనూ కుట్ర

Published Sat, Mar 23 2019 5:21 AM

Conspiracy Also To Give YSRCP Rally Approval - Sakshi

మంగళగిరి: గుంటూరు నార్త్‌జోన్‌ సబ్‌ డివిజన్‌ డీఎస్పీ జి.రామకృష్ణ పాలక పార్టీకి తొత్తులా వ్యవహరించడంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే ఆర్కే శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేసేందుకు అనుమతి కోరగా డీఎస్పీ అనుమతించారు. అందులో సీతారామకోవెల నుంచి కూరగాయల మార్కెట్‌ మీదుగా మిద్దె సెంటర్, గాలిగోపురం మీదుగా తహసీల్దార్‌ కార్యాలయానికి ర్యాలీకి అనుమతిచ్చారు. కూరగాయల మార్కెట్‌ సమీపంలోని వీటీజేఎం, ఐవీటీఆర్‌ డిగ్రీ కళాశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ జరుగుతున్న నేపథ్యంలో.. అదే మార్గంలో అనుమతులు మంజూరు చేశారు. అయితే దీనివెనుక పార్టీ శ్రేణుల్లో గందరగోళం సృష్టించడంతో పాటు ఆ రూట్‌లో ర్యాలీ కొనసాగితే వైఎస్సార్‌సీపీ నాయకులపై కేసులు నమోదు చేసి నామినేషన్‌ కార్యక్రమాన్ని అడ్డుకునే విధంగా కుట్ర పన్నారని పోలీసు సిబ్బందే చెబుతుండడం విశేషం.

వాస్తవానికి సీతారామకోవెల నుంచి హుస్సేన్‌కట్ట మీదుగా గౌతమబుద్దారోడ్‌లోకి  అనుమతి ఇవ్వాలి. డీఎస్పీ కుట్రను గమనించిన వైఎస్సార్‌ సీపీ శ్రేణులు డిగ్రీ కళాశాల వైపు వెళ్లకుండా హుస్సేన్‌కట్ట నుంచి గౌతమబుద్దారోడ్‌కు చేరుకుని యూటర్న్‌ తీసుకుని భారీ ర్యాలీగా వెళ్తుండగా.. సగంమంది కూడా గౌతమబుద్దారోడ్‌ ఎక్కకముందే ట్రాఫిక్‌ను వదిలి జనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. గౌతమబుద్దారోడ్‌ నుంచి మిద్దె సెంటర్‌కు వెళ్లే సమయంలోనూ అలాగే జనం అంతా రాకుండానే వాహనాలను వదిలి  ఇబ్బందులకు గురిచేశారు. మరో వైపు ర్యాలీ వస్తుందని తెలిసి పోలీసులు ఎక్కడా ట్రాఫిక్‌ నియంత్రణకు చర్యలు తీసుకోలేదు. అయితే టీడీపీ అభ్యర్థి లోకేష్‌ ర్యాలీకి మాత్రం  డీఎస్పీ దగ్గరుండి ట్రాఫిక్‌ను పర్యవేక్షించడం పలు విమర్శలకు దారితీస్తోంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement