కాంగ్రెస్‌ది ఓటుభక్తి.. మాది దేశభక్తి

Congress for vote bhakti, BJP for desh bhakti - Sakshi

దేశం కంటే ఓట్లే కాంగ్రెస్‌కు ముఖ్యమన్న ప్రధాని మోదీ

పశ్చిమబెంగాల్, బిహార్‌లలో ప్రధాని ఎన్నికల ప్రచారం

అరారియా/బునియద్‌పూర్‌: కాంగ్రెస్‌వి ఓటుభక్తి రాజకీయమయితే, తమ పార్టీది దేశభక్తి రాజకీయమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. దేశ ప్రయోజనాల కంటే ఓట్లే కాంగ్రెస్‌ పార్టీకి ముఖ్యమని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికల సరళిని చూశాక స్పీడ్‌ బ్రేకర్‌ దీదీ (పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీని)కి కంటిమీద కునుకు కరువైందని ఎద్దేవా చేశారు. శనివారం బిహార్‌లోని అరారియా, పశ్చిమబెంగాల్‌లోని దక్షిణ దినాజ్‌పూర్‌ జిల్లా బునియద్‌పూర్‌లలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని ప్రసంగించారు. ‘దేశ ప్రజలు ఓటు భక్తి, దేశభక్తి అనే రెండు రకాలైన రాజకీయాలను చూశారు.

ఓటు భక్తి రాజకీయం ముంబై ఉగ్రవాదుల విషయంలో వెల్లడైంది. అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ దారుణ ఘటనకు ఒడిగట్టిన పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోలేదు. పైపెచ్చు, హిందూ ఉగ్రవాదం వాదనను తెరపైకి తెచ్చి ఉగ్ర ఘటనలపై నడుస్తున్న విచారణలను పక్కదారి పట్టించింది’ అని ఆరోపించారు. తమ ప్రభుత్వం దేశ శక్తి రాజకీయం చేస్తోందని పేర్కొన్న ప్రధాని.. ‘ఉడి ఆర్మీ బేస్‌ క్యాంప్‌పై దాడికి సర్జికల్‌ స్ట్రైక్స్‌తో, పుల్వామా ఘటనకు వైమానిక దాడులతో దీటుగా బదులిచ్చింది’ అని అన్నారు. అధికారంలో ఉండగా కాంగ్రెస్‌ పార్టీ దేశ ప్రయోజనాలను పక్కనబెట్టి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడిందన్నారు.  బాలాకోట్‌ వైమానిక దాడులపై ఆధారాలు చూపాలని అడిగే ధైర్యం వారిలో లేదన్నారు.

మమతా అసలు స్వరూపం తెలిసింది
పశ్చిమబెంగాల్‌లోని సరిహద్దు జిల్లా దక్షిణ దినాజ్‌పూర్‌లోని బునియద్‌పూర్‌లో ప్రధాని మాట్లాడుతూ..‘రాష్ట్రంలో మొదటి, రెండో విడత ఎన్నికల్లో ఓటర్ల సరళి చూశాక ‘స్పీడ్‌ బ్రేకర్‌ దీదీ’కి కంటిమీద కునుకు కరువైంది’ అని వ్యాఖ్యానించారు. ‘మొదట్లో రాష్ట్రాభివృద్ధిపై చూపే శ్రద్ధ, నిరాడంబరత, కష్టించేతత్వం చూసి మమతా బెనర్జీ ఆదర్శ మహిళని అనుకున్నా. కానీ, ఆ తర్వాత ఆమె వ్యవహార శైలి చూసి నాకున్న భ్రమలు తొలగిపోయాయి. ఆమె అసలు నైజం తెలిసింది. ఆమె ఎలాంటిదో ఇప్పుడు పిల్లలకు సైతం తెలిసిపోయింది’ అని అన్నారు. బంగ్లాదేశ్‌ నటుడు ఫిర్దౌస్‌ టీఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై  స్పందిస్తూ ‘ఎన్నికల్లో ప్రచారం కోసం పొరుగు దేశస్తులను వాడుకోవడం సిగ్గుచేటు. మైనారిటీలను మచ్చిక చేసుకునేందుకే టీఎంసీ ఇలా చేస్తోంది. ఇంతకుముందెన్నడూ భారత్‌లో ఇలా జరగలేదు’ అని విమర్శించారు.

సమాధానంగా ‘సాధ్వి’ని నిలిపాం

హిందూ సంస్కృతిపై  ఉగ్రవాది ముద్ర వేస్తారా?

కాంగ్రెస్‌ను ప్రశ్నించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: సనాతన హిందూ సంస్కృతిపై ఉగ్రవాది ముద్ర వేసిన వారికి సరైన సమాధానం చెప్పేందుకే సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ను భోపాల్‌ బరిలో ఉంచినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ‘బెయిల్‌పై ఉన్న ప్రజ్ఞాసింగ్‌కు బీజేపీ టికెట్‌ ఎందుకు ఇచ్చిందని ప్రశ్నించే వారు అవే ప్రశ్నలను అమేథీ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ను, రాయ్‌బరేలీ బరిలో ఉన్న సోనియాను ఎందుకు అడగరు? వారిపై ఎందుకు చర్చ పెట్టరు? వారు కూడా బెయిల్‌పైనే ఉన్నారు కదా? అని ప్రశ్నించారు. ‘ఒక మహిళ. అందులోనూ సాధ్వి అయిన ప్రజ్ఞాసింగ్‌ను అవమానిస్తున్నారు. భోపాల్‌ టికెట్‌ ఆమెకు ఇచ్చేసరికి గగ్గోలు పెడుతున్నారు. ఇదేం పద్ధతి?’ అని పేర్కొన్నారు. ‘నేను గుజరాత్‌ వాసిని. కాంగ్రెస్‌ పన్నాగాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. సినిమా స్క్రిప్టు మాదిరిగా, వారు తమదైన శైలిలో ఒక స్క్రిప్టు తయారు చేస్తారు.

వాళ్ల దృష్టిలో పోలీస్‌ ఎన్‌కౌంటర్లన్నీ బూటకమే. జడ్జి బీహెచ్‌ లోయా విషయంలోనూ వారిది ఇదే తీరు. ఆయన సహజంగా మరణించినా హత్యకు గురయ్యారంటూ కథనం అల్లింది. సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ కేసులో కోర్టు తీర్పుపై కాంగ్రెస్‌ హిందూ ఉగ్రవాదం అనే వాదనను తెరపైకి తెచ్చింది. ఐదువేల ఏళ్ల  చరిత్ర ఉన్న, వసుధైక కుటుంబం అనే సందేశమిచ్చిన హిందూ సంస్కృతిపై ఉగ్రవాది ముద్ర వేసింది. ఇలాంటి వాటన్నిటికీ సమాధానం ఇచ్చేందుకే సాధ్విని బరిలోఉంచాం. దీని ఫలితం కాంగ్రెస్‌ భారీగా చెల్లించాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు. మాలేగావ్‌ పేలుడు కేసులో నిందితురాలైన సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. మాలేగావ్‌ ఘటనలో ఆరుగురి మృతి చెందగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top