టార్గెట్‌ పాతబస్తీ!

Congress Target To Old City Voters In hyderabad - Sakshi

మజ్లిస్‌ ఓటమి లక్ష్యంగా కాంగ్రెస్‌ వ్యూహం

రంగంలోకి జాతీయ మైనారిటీ నేతలు  

బరిలోకి బలమైన అభ్యర్థులు  

సాక్షి, సిటీబ్యూరో: కాంగ్రెస్‌ ఓటు బ్యాంక్‌కు గండికొడుతున్న మజ్లిస్‌ (ఎంఐఎం)ను పాతబస్తీలోనే మట్టికరిపించేందుకు ఆ పార్టీ వ్యూహం రచిస్తోంది. వీటి మధ్య మైత్రి బంధం తెగిపోయినప్పటి నుంచి వివిధ రాష్ట్రాల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ భారీ మూల్యం చెల్లించుకోక తప్పలేదు. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో మజ్లిస్‌ బరిలోకి దిగడంతో మైనారిటీ ఓట్లు చీలి, పట్టున్న స్ధానాల్లో సైతం కాంగ్రెస్‌ ఓటమి పాలైంది. మరోవైపు బీజేపీకి లాభం చేకూరింది. దీంతో కాంగ్రెస్‌ అధిష్టానం మజ్లిస్‌పై సీరియస్‌గా ఉంది.  తాజాగా తెలంగాణలో తమ ప్రధాన ప్రత్యర్థి టీఆర్‌ఎస్‌తో ఎంఐఎం దోస్తీ కట్టడంపై కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా ఆలోచిస్తోంది.

ఈ నేపథ్యంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆ పార్టీని దెబ్బతీసి గుణపాఠం చెప్పాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పాతబస్తీపై ప్రత్యేక వ్యూహ రచన చేస్తోంది. రెండు రోజుల క్రితం ఏకంగా కాంగ్రెస్‌ రథసారథి రాహుల్‌గాంధీ చార్మినార్‌లో జరిగిన రాజీవ్‌ సద్భావన యాత్ర సభలో పాల్గొని మజ్లిస్‌ పార్టీని టార్గెట్‌ చేస్తూ నిప్పులు చెరిగారు. అంతకముందు రాష్ట్ర స్థాయి అగ్ర నేతలు పాతబస్తీలోని ముస్లిం కుటుంబాలతో భేటీ అయ్యారు. పార్టీ జాతీయ మైనారిటీ సెల్‌ నేత నదీమ్‌ జావిద్‌ ఆదివారం ఇక్కడి మైనారిటీ నేతలతో సమావేశమై పాతబస్తీలోని రాజకీయ పరిస్ధితులపై చర్చించారు. పాతబస్తీలోని ప్రతి అసెంబ్లీ స్థానాన్ని సీరియస్‌గా తీసుకొని ఎన్నికల బరిలోకి దూకాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. అవసరమైతే పార్టీ జాతీయ స్ధాయి ముస్లిం మైనారిటీ నాయకులను రంగంలోకి దింపాలని యోచిస్తోంది. 

నాలుగింటిపై ప్రత్యేక దృష్టి...  
కాంగ్రెస్‌ ఇక్కడ పూర్తిగా మజ్లిస్‌ను టార్గెట్‌ చేసింది. ఎన్నికల బరిలో టీఆర్‌ఎస్, బీజేపీ పక్షాలు దిగే అవకాశం ఉన్నప్పటికీ... కేవలం మజ్లిస్‌పైనే దృష్టిసారించింది. పాతబస్తీ మజ్లిస్‌కు కంచుకోట కావడంతో ఇతర పక్షాలు తలపడడం అంత సులభం కాదు. మైనారిటీలు గణనీయంగా ఉండడంతో ఓటర్లు మొత్తం ఒకవైపు మొగ్గు చూపుతారు. గత ఎన్నికల ముందు వరకు మజ్లిస్‌తో దోస్తీ కారణంగా కాంగ్రెస్‌ స్నేహపూర్వక పోటీ చేస్తూ వచ్చింది. అంతకముందు వరకు పాతబస్తీలో కాంగ్రెస్‌కు ఓటు బ్యాంక్‌ పెద్దగా లేకుండా పోయింది. తాజాగా  పరిస్ధితులు తారుమారు కావడంతో కాంగ్రెస్‌... మజ్లిస్‌ను టార్గెట్‌ చేసింది. ఈసారి ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం మజ్లిస్‌కు ఏడు సిట్టింగ్‌ స్థానాలు ఉండగా... అందులో నాలుగు స్థానాలను కాంగ్రెస్‌ ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా నాలుగు స్థానాల్లో బలమైన అభ్యర్థులను బరిలో దింపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top