రైతు ఎజెండాతో ముందుకు

Congress Leaders Decision In A Meeting At Gandhi Bhavan - Sakshi

రుణమాఫీ, రైతుబంధుపై అసెంబ్లీలో పోరాడాలని కాంగ్రెస్‌ నిర్ణయం 

గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ ముఖ్య నేతల భేటీలో నిర్ణయం 

కొత్త రెవెన్యూ చట్టానికి మద్దతిస్తాం: జీవన్‌రెడ్డి, కోదండరెడ్డి

డీసీసీబీ, డీసీఎంఎస్‌లన్నీ టీఆర్‌ఎస్‌ ఖాతాలోకే రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార సంఘాల మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌) చైర్మన్, వైస్‌ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ శనివారం ముగిసింది. డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్, వైస్‌ చైర్మన్‌ పదవులన్నీ ఏకగ్రీవం కాగా అధికార టీఆర్‌ఎస్‌ మద్దతుదారులే జిల్లా సహకార పీఠాలను కైవసం చేసుకున్నారు. కాగా, టెస్కాబ్‌ చైర్మన్‌ ఎన్నికకు సంబంధించి ఈ నెల 2 లేదా 3 తేదీల్లో నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉండగా, 5న ఎన్నిక జరగనుంది. టెస్కాబ్‌ తాజా మాజీ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు మళ్లీ చైర్మన్‌ పదవికి పోటీపడే అవకాశముంది.    

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో రైతు సమస్యలే ఎజెండాగా పోరాడాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. రైతు రుణమాఫీ, రైతుబంధు అమల్లో అస్పష్టత వంటి అంశాలను ముందుపెట్టి ప్రభుత్వాన్ని నిలదీయాలనే నిశ్చయానికి వచ్చింది. లక్ష రూపాయల వరకు మాఫీ చేస్తామని చెప్పి ఇంతవరకు దాన్ని అమలు చేయకపోవడం, తెలంగాణ ఏర్పాటు అనంతరం ఆరువేల మంది రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకోవడం వంటి అంశాలను ప్రధానంగా లేవనెత్తి ప్రభుత్వాన్ని ఎండగట్టాలని నిర్ణయించింది. రానున్న పార్లమెంట్, అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా వ్యవసాయ, రైతు అంశాలే ఎజెండాగా పార్టీ లేవనెత్తాల్సిన విషయాలపై కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతల సమావేశం గాంధీభవన్‌లో శనివారం జరిగింది.

ఈ భేటీకి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, రాష్ట్ర చైర్మన్‌ అన్వేష్‌రెడ్డి, డీసీసీలు హాజరయ్యారు. సమావేశానికి ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, వీరయ్య, సీతక్క, రాజగోపాల్‌రెడ్డి, ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గైర్హాజరయ్యారు. రాష్ట్రంలో ఇటీవల ప్రధాన సమస్యగా మారిన కందుల కొనుగోళ్లలో జాప్యం, రబీ రైతుబంధు పథకం పూర్తి స్థాయిలో అందకపోవడం వంటి అంశాలను చర్చించారు. రైతుబంధు పథకానికి ఎలాంటి పరిమితులు విధించలేదని గత అసెంబ్లీ సమావేశాల్లో స్వయంగా సీఎం కేసీఆర్‌ ప్రకటించినప్పటికీ, కేవలం 3 ఎకరాల్లోపు వారికే అది వర్తిస్తోందని నేతలు సమావేశంలో ప్రస్తావించారు. దీనిపై అసెంబ్లీలోనే స్పష్టత కోరాలని నిర్ణయించారు. కంది కొనుగోళ్లకు పరిమితులు విధించడం మంచి పద్ధతి కాదని, రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని పూర్తి స్థాయిలో కందులు కొనుగోలు చేసేలా పోరాటం చేయాలని భేటీలో నిర్ణయించారు.  

6 వేల మంది రైతుల ఆత్మహత్యలు... 
ఈ భేటీ అనంతరం ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం ఆరువేల మంది రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. లక్ష రూపాయల వరకు రుణ మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌ పార్టీ హామీ ఇచ్చినా, దాన్ని అమలు చేయడం లేదని విమర్శించారు. రైతు బీమా 59 ఏళ్ల లోపు వారికి మాత్రమే వర్తింపు చేస్తున్నారని, ఆత్మహత్య చేసుకున్న రైతుకు రూ.6 లక్షలు ఇవ్వాలన్న ఉత్తర్వులు అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఈ అంశాలపై బడ్జెట్‌ సమావేశాల్లో ప్రస్తావిస్తామన్నారు. ఆంక్షలు లేకుండా రైతు బంధు అమలు చేయాలని జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కొత్త రెవెన్యూ చట్టాన్ని శాసనసభలో ప్రవేశపెడితే కాంగ్రెస్‌ పార్టీ సహకరిస్తుందని కోదండరెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ భేటీల్లో రైతు పక్షాన పార్టీ ఎమ్మెల్యేలం పోరాటం చేస్తామని జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రైతుకు ఉపాధి కల్పిస్తే, టీఆర్‌ఎస్‌ పార్టీ భూములను అమ్మి పేదలను ఇబ్బందులకు గురిచేస్తోందని దుయ్యబట్టారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top