16న కాంగ్రెస్‌ బస్సుయాత్ర

Congress Leaders Bus tour In Illendhu From 16th - Sakshi

హాజరుకానున్న ఉత్తమ్, జానా, భట్టి, రేవంత్‌  

10 వేల మందితో బహిరంగ సభ

ఇల్లెందు: జిల్లాలోకి ఈనెల 16న రానున్న కాంగ్రెస్‌ బస్సుయాత్ర విజయవంతం కోసం ఆ పార్టీ నేతల్లో హడావిడి మొదలైంది. మొదట ఇల్లెందులోనే ప్రారంభం కావడంతో స్థానిక నాయకులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో కాంగ్రెస్‌ ఏ కార్యక్రమం తలపెట్టిన ఇల్లెందుకు ప్రాధాన్యత లభిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లెందులో మాత్రమే కాంగ్రెస్‌ విజయం సాధించింది. అయితే కొద్ది రోజులకే ఎమ్మెల్యే కోరం కనకయ్య టీఆర్‌ఎస్‌లో చేరిన విషయం విదితమే. ఎమ్మెల్యే వెంట జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, మున్సిపల్‌ చైర్మన్‌ లాంటి కీలక నేతలంగా వెళ్లడంతో కాంగ్రెస్‌ డీలా పడింది. గత రెండేళ్ల కాలంలో ఒక వైపు పార్టీ కార్యక్రమాలు, మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను ప్రచారం చేస్తూ పార్టీ బలోపేతం కోసం విశ్వప్రయత్నం చేస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ తర్వాత అతి పెద్ద ఓటు బ్యాంకు కలిగిన పార్టీగా కాంగ్రెస్‌ నిలిచింది. గత ఏడాది కాలంగా ఇల్లెందు బరిలో నిలబడే కాంగ్రెస్‌ నేతల జాబితా రోజురోజుకూ  పెరుగుతోంది.

అభ్యర్థుల సంఖ్య పెరగటంతో ఇక్కడ సభల విజయవంతం బా«ధ్యత కూడా వారి భుజాలపై మోపుతున్నారు. గత మార్చి 10న యువజన కాంగ్రెస్‌ చైతన్య సదస్సు నిర్వహించగా, ఈ నెల 16న కాంగ్రెస్‌ ప్రజా చైతన్య బస్సు యాత్ర నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ రోజున మధ్యాహ్నం 3 గంటలకు బస్సు యాత్ర ర్యాలీ బయలు దేరుతుంది.  పట్టణంలో  ప్రధాన రహదారుల గుండా సాగే ర్యాలీ 4  గంటలకు  జేకే సింగరేణి హైస్కూల్‌  గ్రౌండ్‌కు చేరుకుంటుంది. అక్కడ జరిగే సభలో పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, ప్రతిపక్ష నాయకులు కె.జానారెడ్డి, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర మాజీ మంతి పోరిక బలరాం నాయక్, మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ, నాయకులు రేవంత్‌ రెడ్డి, రేణుకాచౌదరి, పొంగులేటి సుధాకర్‌రెడ్డిæ, సంభాని చంద్రశేఖర్, వనమా వెంకటేశ్వరరావు తదితర నేతలు పాల్గొననున్నారు. బస్సుయాత్ర సందర్భంగా సుమారు 10 వేల మందితో బహిరంగ సభ నిర్వహించాలని యోచిస్తున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top