ఎమర్జెన్సీ.. కాంగ్రెస్‌ పాపం | Congress has not changed since Emergency: Narendra Modi | Sakshi
Sakshi News home page

ఎమర్జెన్సీ.. కాంగ్రెస్‌ పాపం

Jun 27 2018 1:01 AM | Updated on Mar 18 2019 9:02 PM

Congress has not changed since Emergency: Narendra Modi - Sakshi

ముంబై: దేశంలో ఎమర్జెన్సీ(అత్యవసర పరిస్థితి) విధించడం కాంగ్రెస్‌ చేసిన పాపమని, ఒక కుటుంబ ప్రయోజనం కోసం దేశ రాజ్యాంగాన్నే దుర్వినియోగం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ  నిప్పులు చెరిగారు. ఎమర్జెన్సీ విధించి 43 ఏళ్లు పూర్తైన సందర్భంగా మంగళవారం ముంబైలో బీజేపీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. కాంగ్రెస్, గాంధీ కుటుంబంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం మొత్తం దేశాన్ని కాంగ్రెస్‌ జైలుగా మార్చేసిందని మండిపడ్డారు.

ప్రస్తుతం దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందన్న ప్రతిపక్షం విమర్శల్ని తోసిపుచ్చుతూ.. అప్పటికీ, ఇప్పటికీ వ్యక్తిపూజ వైఖరిలో కాంగ్రెస్‌ పార్టీలో ఎలాంటి మార్పులేదని విమర్శల వర్షం కురిపించారు. 1975లో ఎమర్జెన్సీ విధించినప్పుడు ఏం జరిగిందో నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరముందన్నారు.  ‘అప్పట్లో భయానక వాతావరణం నెలకొంది. న్యాయవ్యవస్థ అధికారాలకు కత్తెర వేశారు.

కాంగ్రెస్‌ కోసం పాటలు పాడేందుకు నిరాకరించినందుకు అలనాటి ప్రముఖ బాలీవుడ్‌ గాయకుడు కిశోర్‌ కుమార్‌ పాటల్ని రేడియోలో ప్రసారం కాకుండా అడ్డుకున్నారు. ఎవరైనా ఎదురుతిరిగితే జైలు తప్పదన్న పరిస్థితి కల్పించారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గురించి పెద్ద పెద్ద మాటలు చెబుతున్న వీరంతా ఒకప్పుడు దేశాన్ని ఒక జైలులా మార్చారు. అధికారం కోల్పోతామని గ్రహించిన మరుక్షణం.. దేశం సంక్షోభంలో కూరుకుపోయిందని, తాము మాత్రమే దేశాన్ని రక్షించగలమని కాంగ్రెస్‌ పార్టీ, గాంధీ కుటుంబం ప్రచారం మొదలుపెట్టేవి’ అని మోదీ దుయ్యబట్టారు.  

యువత తప్పక తెలుసుకోవాలి
‘ఎమర్జెన్సీని బ్లాక్‌డే గా జరుపుకోవడం కేవలం కాంగ్రెస్‌ చేసిన పాపాల్ని విమర్శించడానికి మాత్రమే కాదు. అప్పుడు ఏం జరిగిందో ప్రస్తుత, భవిష్యత్‌ తరాలు తెలుసుకునేందుకు కూడా.. అలాగే రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షించుకోవాలో ఆ చీకటి రోజుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి’ అని ప్రధాని చెప్పారు.

రాజ్యాంగ భద్రత, ప్రజాస్వామ్య పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ‘రాజ్యాంగం, దళితులు, మైనార్టీలు ప్రమాదంలో ఉన్నారంటూ కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం చేస్తోంది. ఆ పార్టీ ఎన్నటికీ మారదు. సొంత ప్రయోజనాల ప్రచారం కోసం పార్టీని నాశనం చేసుకుంటోంది’ అని విమర్శించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయాక ఈవీఎంల్ని, ఎన్నికల కమిషన్‌ పనితీరును కాంగ్రెస్‌ విమర్శించడాన్ని మోదీ తప్పుపట్టారు.


ఔరంగజేబు కంటేక్రూరం: కాంగ్రెస్‌
కాంగ్రెస్‌తో పాటు గాంధీ కుటుంబంపై ప్రధాని మోదీ చేసిన విమర్శల్ని ఆ పార్టీ తిప్పికొట్టింది. మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు కంటే ప్రధాని మోదీ క్రూరమైన వ్యక్తని.. దేశంలో గత 49 నెలలుగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారని ఆరోపించింది.

కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా మాట్లాడుతూ.. తన తప్పిదాలను, శుష్క వాగ్దానాల్ని కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్‌పై మోదీ ఆరోపణలు చేస్తున్నారన్నారు. అసమ్మతిని అణచివేసేందుకు తమను వ్యతిరేకించేవారిపై జాతి వ్యతిరేకిగా ముద్ర వేస్తున్నారని మం డిపడ్డారు. ఎమర్జెన్సీని సమర్థిస్తూ.. ‘ధని కులు, జమిందార్లకు అనుకూలంగా వ్యవహరించిన జనతా పార్టీకి వ్యతిరేకంగా, పేదల హక్కుల్ని కాపాడేందుకే నాడు ఎమర్జెన్సీ విధించారు’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement