ఏ తీరుగ చూసిన ఓటమియే ఖాయం!

Congress Admits That It Faces Uphill Battle To Defeat The BJP In Chhattisgarh - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తాం, మధ్యప్రదేశ్‌లో అటూ ఇటుగా ఉంది. ఇప్పుడే చెప్పలేం, ఛత్తీస్‌గఢ్‌లో ఓడిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి’ పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని కేంద్రంలోని సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్న మాటలివి. ఛత్తీస్‌గఢ్‌లో క్షేత్ర స్థాయి పరిస్థితులను పరిశీలిస్తే కూడా అక్కడ కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 ఏళ్లు అవుతున్నందున ఆయన ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉండాల్సినంత వ్యతిరేకత ఉంది.

ముఖ్యమంత్రిగా రమణ్‌ సింగ్‌ పట్ల మాత్రం ప్రజల్లో వ్యతిరేకత లేకపోవడం విశేషం. ఆయన మంత్రుల పట్ల, ఎక్కువ మంది శాసనసభ్యుల పట్ల ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ విషయాన్ని గ్రహించడం వల్లనే పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో 50 శాతం కొత్తవారికి సీట్లు ఇస్తామని ప్రకటించారు. అంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న, ప్రజలు వ్యతిరేకిస్తున్న సిట్టింగ్‌ సభ్యులకు టిక్కెట్లు రావన్న మాటే. ఆదివాసీల బలమైన నాయకుడు, రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రామ్‌ దయాళ్‌కు గాలం వేసి అక్టోబర్‌ 13వ తేదీనే బీజేపీ లాక్కుంది. ఎన్నికల నాటికి ఆయన అనుచర నాయకులు మరికొంత మంది వచ్చి బీజేపీలో చేరే అవకాశం ఉంది.

అటు కేంద్రంలో, ఇటు పార్టీలోను అధికారంలో ఉన్న బీజేపీకి అపార పార్టీ నిధులు ఉన్నాయి. ఆ నిధులతోని గతంలోలాగా ఈసారి కూడా కాంగ్రెస్‌ అభ్యర్థులను కొనేందుకు వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. గత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అంతాగఢ్‌ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా నామినేషన దాఖలు చేసిన మంతురామ్‌ తర్వాత బీజేపీలో చేరిపోవడం తెల్సిందే. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌ భిండ్‌ లోక్‌సభ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థిగా భగీరథ్‌ ప్రసాద్‌ను ప్రకటించాక ఆయన్ని బీజేపీ లాక్కుంది. ఆదివాసీల్లో, దళితుల్లో ఎంతో ఆదరణ కలిగిన కాంగ్రెస్‌ పార్టీకి ఆదివాసీల నాయకుడు రమణ్‌ సింగ్‌ బీజేపీలో చేరడం పెద్ద దెబ్బకాగా, కాంగ్రెస్‌ వినాశనమే తన లక్ష్యమని చెప్పుకుంటున్న అజిత్‌ జోగి పార్టీ ఈసారి మాయావతి నాయకత్వంలోని బీఎస్పీతో చేతులు కలిపి చత్తీస్‌గఢ్‌లో పోటీ చేయడం కాంగ్రెస్‌ పార్టీకి మరో దెబ్బ. కాంగ్రెస్‌ పార్టీకి, పాలకపక్ష బీజేపీకి కేవలం 0.7 శాతం ఓట్లు మాత్రమే తేడా ఉన్న నేపథ్యంతో మూడో పార్టీ పోటీకి రావడం అన్నది బీజేపీకే ఇక్కడ కలసి వచ్చే అవకాశం.

బలహీనమైన నాయకత్వం
కాంగ్రెస్‌ పార్టీకి ఛత్తీస్‌గఢ్‌లో బలమైన నాయకత్వం లేకుండా పోయింది. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు భూపేశ్‌ భగేల్‌కు వ్యతిరేకంగా ఇటీవలనే ఆడియో స్టింగ్‌ ఆపరేషణ్‌ ఒకటి వెలుగులోకి వచ్చింది. అందులో ఆయన టక్కెట్ల కోసం డబ్బులు డిమాండ్‌ చేసినట్లు ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రాష్ట్రం నుంచి పోటీచేసే అభ్యర్థుల జాబితాను పరిశీలించేందుకు ఐదుగురు సీనియర్లతో ఓ కమిటీని వేశారు. రాష్ట్ర మంత్రి రాజేష్‌ మునత్‌కు వ్యతిరేకంగా బ్యూఫిల్మ్‌ సీడీని విడుదల చేసిందీ భూపేశ్‌ అని తేలడం, అందులో ఉన్నది తాను కాదని, మార్ఫింగ్‌ చేశారని ఆరోపిస్తూ సదరు మంత్రి కేసు పెట్టడంతో భూపేశ్‌ గత సెప్టెంబర్‌ నెలలోనే అరెస్టయ్యారు. కేసు విచారణ కొనసాగుతోంది.

ప్రచారంలోనూ వెరీ పూర్‌
కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ మరీ పూర్‌గా ఉంది. రమణ్‌ సింగ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుమ్మెత్తి పోయాల్సిన కాంగ్రెస్‌ పార్టీ, కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మాత్రమే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. పైగా రమణ్‌ సింగ్‌ను ఎవరు కూడా పల్లెత్తుమాట అనడం లేదు. అందుకు కారణం రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఆయన ద్వారా ఏదో విధంగా లబ్ధి పొందడటమే. రమణ్‌ సింగ్‌ ప్రభుత్వాన్ని విమర్శించాలంటే చాలా అంశాలే ఉన్నాయని, ముఖ్యంగా రాష్ట్రంలోని అతివిలువైన  జాతీయ వనరులను ప్రైవేటు కార్పొరేట్‌ సంస్థలకు ధారాదత్తం చేయడం, కొత్త రాజధాని నిర్మాణం పేరిట నిధులను విచ్చలవిడిగా ఖర్చు పెట్టడమని సామాజిక కార్యకర్త విక్రమ్‌ సింఘాల్‌ తెలిపారు. పైగా కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారం ఎలాంటి పంచ్‌ లేకుండా చప్పగా సాగుతుంటే, బీజేపీ ప్రచారం దూకుడుగా సాగుతోందని ఆయన తెలిపారు. ఏ రకంగా చూసినప్పటికీ ఈసారి కూడా కాంగ్రెస్‌కు అక్కడ ఓటమి తప్పేట్లు లేదు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top