కుమారస్వామి Vs సిద్దరామయ్య

CM Kumaraswamy slams Siddaramaiah for budget remarks - Sakshi

కర్ణాటక సంకీర్ణంలో లుకలుకలు

కొత్త బడ్జెట్‌ను వ్యతిరేకిస్తున్న సిద్దరామయ్య

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్‌–జేడీఎస్‌ సంకీర్ణ సర్కారు కొలువుదీరి నెల రోజులు గడవకుండానే లుకలుకలు బయటపడుతున్నాయి. మాజీ సీఎం సిద్దరామయ్య– సీఎం కుమారస్వామి మధ్య యుద్ధం తీవ్రమైంది. జూలై మొదటివారంలో బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు కుమారస్వామి ఒకవైపు కసరత్తు చేస్తుండగా.. సిద్దరామయ్య బడ్జెట్‌ను వ్యతిరేకిస్తున్నారు. ఫిబ్రవరిలో కాంగ్రెస్‌ సర్కారు బడ్జెట్‌ సమర్పించిందని, ఇప్పుడు మరో బడ్జెట్‌ అవసరమేంటని వాదిస్తున్నారు.

‘సిద్దరామయ్య బడ్జెట్‌ ప్రవేశపెట్టినప్పుడు ఉన్న ఎమ్మెల్యేల్లో సుమారు 100 మంది ఎన్నికల్లో ఓడిపోయారు. వారి స్థానంలో కొత్త ఎమ్మెల్యేలు వచ్చారు. కొత్త బడ్జెట్‌ ప్రవేశపెట్టకపోతే వారు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తారు. బడ్జెట్‌కు రాహుల్‌ ఓకే చెప్పారు. సిద్దరామయ్య ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదు’ అని కుమారస్వామి సిద్దరామయ్య వాదనను తోసిపుచ్చారు. భాగస్వామ్య పార్టీ తిరుగుబాటుకు సిద్ధమైతే పాలన సాగించేదెలా అని కుమారస్వామి సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలిసింది.

సిద్దరామయ్య పద్ధతి బాగాలేదు: దేవెగౌడ  
ఈ వ్యవహారంలో కొడుకుకు మాజీ ప్రధాని దేవెగౌడ మద్దతు పలికారు. ‘రైతు రుణమాఫీ, కొత్త బడ్జెట్‌పై మంత్రులు, ఎమ్మెల్యేలతో చర్చించాకే కుమారస్వామి నిర్ణయాలు తీసుకున్నారు. సిద్దరామయ్య దీనిని నిరసిస్తూ తన సన్నిహితులతో రహస్యంగా సమావేశం కావడం ఏంటి’ అని ఆయన ప్రశ్నించారు. ధర్మస్థలలో సన్నిహిత ఎమ్మెల్యేలతో సిద్దరామయ్య రహస్య మంతనాలు చేయడం బాగాలేదన్నారు. సంకీర్ణ సర్కారులో తనకు ప్రాధాన్యం కరువైందని ఆయన కినుకతో ఉన్నారు. మరోవైపు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాతో మాజీ సీఎం యడ్యూరప్ప సోమవారం సాయంత్రం అహ్మదాబాద్‌లోని ఒక హోటల్లో భేటీ అయ్యారు. యడ్యూరప్పతో పాటు కర్ణాటకకు చెందిన ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు సమాచారం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top