ఆర్టికల్‌ 370 రద్దుపై కమల్‌హాసన్‌ కామెంట్‌

Clear Assault On Democracy Kamal Haasan Shreds Kashmir Move - Sakshi

ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్లుగా ఉంది

సాక్షి, చెన్నై : జమ్మూకశ్మీర్‌ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370, 35 ఏ రద్దుతో పాటు ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మక్కల్‌ నీది మయ్యం(ఎంఎన్‌ఎం) అధినేత కమల్‌హాసన్‌ తీవ్రంగా ఖండించారు. బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌లో వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్లుగా ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలతో నిరంకుశంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఆర్టిక‌ల్ 370, 35ఏల‌కు ఓ ప్ర‌త్యేక‌త ఉన్న‌ద‌ని, వాటిలో మార్పులు చేయాల‌నుకుంటే, ముందుగా చ‌ర్చ‌ల ద్వారా ఆ ప్ర‌క్రియ చేప‌ట్టాల‌న్నారు.

(చదవండి : మోదీ వల్లే కశ్మీర్‌ సమస్యకు పరిష్కారం!!)

జమ్మూకశ్మీర్‌ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370, 35–ఏ అధికరణాలను  నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను కూడా తొలగిస్తూ, దానిని అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చింది. లదాఖ్‌ ప్రాంతాన్ని కూడా జమ్మూ కశ్మీర్‌ నుంచి పూర్తిగా వేరు చేసి, ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది. వీటికి సంబంధించిన తీర్మానం, బిల్లులను కేంద్రం సోమవారమే రాజ్యసభలో ఆమోదింపజేసుకుంది. 

(చదవండి : జన గణ మన కశ్మీరం)

సరిహద్దుల మార్పులకు సంబంధించి ‘జమ్మూ కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు–2019’ని కూడా అమిత్‌ షా రాజ్యసభలో ప్రవేశ పెట్టగా, ఓటింగ్‌ అనంతరం సభ ఈ బిల్లును ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 125 ఓట్లు, వ్యతిరేకంగా 61 ఓట్లు వచ్చాయి. జమ్మూ కశ్మీర్‌లో ప్రధాన పార్టీలైన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సీ), పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పీడీపీ)లతోపాటు ప్రధాన విపక్ష పార్టీలైన కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్‌ కాంగ్రెస్‌ తదితర పార్టీలు కేంద్రం చర్యను తీవ్రంగా వ్యతిరేకించాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top