మోదీ వల్లే కశ్మీర్‌ సమస్యకు పరిష్కారం!!

Mehbooba Mufti Comments On PM Modi When Part Of Coalition Govt - Sakshi

చర్చనీయాంశమైన ముఫ్తి మాటలు

న్యూఢిల్లీ : ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జమ్మూ కశ్మీర్‌ గురించే చర్చ నడుస్తోంది. భారీగా కేంద్ర బలగాల మోహరింపు, అమర్‌నాథ్‌ యాత్ర నిలిపివేత ద్వారా కశ్మీర్‌ అంశంపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు కేంద్రం సంకేతాలు పంపింది. ఈ క్రమంలో ఆర్టికల్‌ 370ను రద్దు చేస్తూ జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా తొలగిస్తున్నట్లు ప్రకటించి యావత్‌ దేశ ప్రజల ఉత్కంఠకు అమిత్‌ షా తెరదించారు. ఈ నేపథ్యంలో మోదీ సర్కారు సంచలన నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ను రద్దు చేస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తి మండిపడిన విషయం తెలిసిందే. భారత ప్రజాస్వామ్యంలో నేడు ఒక దుర్దినం అని.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా ఉందని ఆమె విమర్శించారు.

ఈ నేపథ్యంలో...‘నా నిర్ణయం కారణంగా నేడు నాపై విమర్శలు వెల్లువెత్తవచ్చు. కానీ ఒక విషయం కచ్చితంగా చెప్పగలను. జమ్ము కశ్మీర్‌ సమస్యను పరిష్కరించగల ఏకైక వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమే’  అన్న ముఫ్తి మాటలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. అయితే అవి ఆమె ఇప్పుడు అంటున్న మాటలు కావు. బీజేపీతో కలిసి కశ్మీర్‌ సంకీర్ణ ప్రభుత్వంలో భాగమై ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాటివి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మోదీ సర్కారును విమర్శిస్తూ ముఫ్తి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఆమె మోదీని కొనియాడిన మాటలను ఉటంకిస్తూ నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. ‘అధికారం కోసం నాడు బీజేపీతో చేతులు కలిపి.. ఇప్పుడు ఇలా మాట్లాడతారా. నిజానికి కశ్మీర్‌కు మీలాంటి వల్లే అన్యాయం జరిగిందని’ కొంతమంది విమర్శిస్తున్నారు. మరికొంత మంది మాత్రం...‘మోదీ సమస్యను పరిష్కరిస్తారు అని ముఫ్తి అన్నారు గానీ... ఇలా సమస్యను మరింత జఠిలం చేస్తారని ఊహించి ఉండరు అందుకే అలా మాట్లాడారు’ అంటూ ఆమెకు అండగా నిలుస్తున్నారు.

కాగా జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీ-పీడీపీ కలిసి 2015లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తి ముఖ్యమంత్రి గద్దెనెక్కారు. అయితే భేదాభిప్రాయాలు తలెత్తిన నేపథ్యంలో 2018లో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. ఈ క్రమంలో అక్కడ గవర్నర్‌ పాలన విధించింది. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ పీడీపీ, కాంగ్రెస్‌, ఎన్సీ పార్టీలు పేర్కొన్నప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించలేదు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top