బీసీలు, కాపులను టీడీపీ మోసం చేస్తోంది

Chandrababu Naidu cheating BCs, Kapus: Janga Krishnamurthy - Sakshi

మంజునాథ్‌ కమిషన్‌ నివేదికను అధ్యయనం చేయకుండా తీర్మానమేంటి ?

వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి ధ్వజం  

ఒంగోలు వన్‌టౌన్‌: ‘యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఉండడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పులున్నాయి. మరోవైపు ప్రధాని కూడా ఇదే విషయాన్ని నొక్కివక్కాణిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారు?’ అని వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. రాజకీయ అవసరాల కోసం బీసీలు, కాపులను టీడీపీ మోసం చేస్తోందని మండిపడ్డారు. సోమవారం ప్రకాశం జిల్లా పార్టీ కార్యాలయంలో బీసీ సెల్‌ కార్యవర్గ సమావేశం జరిగింది. అనంతరం కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడారు.

జస్టిస్‌ మంజునాథ్‌ కమిషన్‌ నివేదికను అధ్యయనం చేయకుండా.. కాపులకు రిజర్వేషన్లంటూ తీర్మానం ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే చంద్రబాబు ఈ విధంగా కులాల మధ్య కుంపటి పెడుతున్నారని మండిపడ్డారు. గతంలో ఎమ్మార్పీఎస్‌ను దగ్గరకు తీసిన చంద్రబాబు.. అవసరం తీరిపోయాక వారిని కరివేపాకులా పక్కన పడేసిన విషయం అందరికీ తెలిసిందేన్నారు. 2012 బీసీ డిక్లరేషన్‌లో దాదాపు 120 హామీలిచ్చారని.. అధికారంలోకి వచ్చాక అందులో ఒక్కటీ అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల సమగ్రాభివృద్ధికి వైఎస్సార్‌సీపీ కట్టుబడి ఉంటుందని చెప్పారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. కుమ్మరి, నాయీబ్రాహ్మణ, రజకులకు ఎమ్మెల్సీ ఇస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. గ్రామస్థాయి నుంచి వివిధ కులాల స్థితిగతులను అధ్యయనం చేసేందుకు కమిటీ వేసినట్లు తెలిపారు. సమావేశంలో బీసీ సెల్‌ రాష్ట్ర నాయకులు అవ్వారు ముసలయ్య, గోలి తిరుపతిరావు, జిల్లా అధ్యక్షులు కఠారి శంకర్, మద్దిబోయిన సురేష్, కటారి ప్రసాద్, జువ్వి రాము, బత్తుల ప్రమీల పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top