బ్యాలెట్టే బెస్ట్‌ | Chandrababu met with leaders of various parties in Delhi | Sakshi
Sakshi News home page

బ్యాలెట్టే బెస్ట్‌

Apr 15 2019 3:44 AM | Updated on Apr 15 2019 3:44 AM

Chandrababu met with leaders of various parties in Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడం మంచిదని, దానివల్ల ఎలాంటి సమస్యలు రావని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈవీఎంలను మానిప్యులేట్‌ చేయవచ్చని ఆరోపించారు. చిప్‌లు మార్చడం, సాఫ్ట్‌వేర్‌ కోడింగ్‌ను మార్చడం చేయవచ్చన్నారు. 50 శాతం వీవీప్యాట్‌లను లెక్కించే విషయమై ఎన్నికల సంఘం సాకులు చెప్పడం సరికాదని మండిపడ్డారు. ఈవీఎంల పనితీరుపై చర్చించేందుకు సేవ్‌ డెమోక్రసీ పేరుతో చంద్రబాబు ఆదివారం ఢిల్లీలో వివిధ పార్టీల నేతలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి కపిల్‌ సిబల్, అభిషేక్‌ సింఘ్వీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, సీపీఎం నేత నీలోత్పల్‌ బసు, ఎస్పీ నుంచి సురేంద్రసింగ్, జేడీఎస్‌ నేత ఒకరు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పోలింగ్‌ సందర్భంగా ఓటరు ఎవరికి ఓటేశారనేదానిపై వీవీప్యాట్‌లో 7 సెకన్లపాటు పార్టీ గుర్తు కనిపించాలని, కానీ ఈ ఎన్నికల్లో 3 సెకన్లు మాత్రమే గుర్తులు కనిపించాయని చెప్పారు.

ఈసీ నిబంధనల ప్రకారం ఏడు సెకన్లు కాకుండా మూడు సెకన్లు మాత్రమే కనిపించేలా ఏమైనా ప్రోగ్రామింగ్‌ మార్చారా? అలా మారిస్తే ఎప్పుడు మార్చారు? ఆ విషయాన్ని ఎందుకు చెప్పలేదు? అని ప్రశ్నించారు. ఈవీఎంల ఆడిట్‌కోసం ఇప్పటివరకు ఎలాంటి నిబంధనలు లేవని, ఈవీఎంల వినియోగాన్ని పర్యవేక్షించే అథారిటీ కూడా లేదన్నారు. దీనిపై పార్లమెంటుకు కూడా అవగాహన లేదన్నారు. తెలంగాణలో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు వ్యత్యాసం ఉందన్నారు. అదే బ్యాలెట్‌ ఓటింగ్‌లో ఇలాంటి సమస్యలు రావన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో మొదట 30 శాతం ఈవీఎంలు పనిచేయలేదని, సీఈవో కూడా ఓటు వేసేందుకు ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. మరుసటిరోజు తెల్లవారుజాము 4.30 గంటల వరకు కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్‌ జరగడం ప్రజాస్వామ్యమేనా? అని ప్రశ్నించారు. ఈసీ పక్షపాతంగా వ్యవహరించిందని, తన అధికారుల్ని ఇష్టానుసారంగా మార్చి వైఎస్‌ జగన్‌ కేసుల్లో నిందితుడిని సీఎస్‌గా నియమించిందని ఆరోపించారు.

తాను ఫలితాలపై భయపడట్లేదని, వెయ్యి శాతం తామే గెలుస్తామన్నారు. ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాయని, తాను ఈవీఎంలపై పోరాటం చేస్తున్నది దేశం కోసమని చెప్పుకొచ్చారు. వీవీప్యాట్‌లను లెక్కించేందుకు ఆరు రోజులు పడుతుందంటూ సుప్రీంకోర్టును ఎన్నికల సంఘం తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు. కోట్లాది రూపాయలు వెచ్చించి  కొన్న వీవీప్యాట్‌లను ఐదు మాత్రమే లెక్కించాలనడం సరికాదని, దీనిపై తాము సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేస్తామని చెప్పారు. అభిషేక్‌ సింఘ్వీ మాట్లాడుతూ 50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలనేది తమ డిమాండ్‌ అని తెలిపారు. కపిల్‌ సిబల్‌ మాట్లాడుతూ తమకు పేపర్‌ బ్యాలెట్‌పైనే విశ్వాసముందని, యంత్రాలపై లేదని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎక్కడ బలంగా ఉన్నాయో అక్కడే బీజేపీ ఈవీఎంల సమస్యలు సృష్టిస్తోందని కేజ్రీవాల్‌ ఆరోపించారు. చివర్లో చంద్రబాబు సలహాదారు వేమూరి హరిప్రసాద్‌.. ఓ డెమో పోలింగ్‌ వీడియోను ప్రదర్శించారు.

అంబేడ్కర్‌ స్ఫూర్తిని కొనసాగిస్తాం..
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ 128వ జయంతి వేడుకలు ఆదివారం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో జరిగాయి. ఏపీ–తెలంగాణ భవన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశంలో అన్ని సమస్యలకు పరిష్కార మార్గాలను అంబేడ్కర్‌ రాజ్యాంగంలో పొందుపరిచారన్నారు. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని మనం కాపాడుకోగలిగితే ప్రపంచంలో ఏ దేశం మనతో పోటీపడలేదన్నారు. అంబేడ్కర్‌ స్ఫూర్తిని ఎల్లప్పుడూ కొనసాగిస్తామన్నారు. అమరావతిలో 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement